Rajinikanth Tax : తమిళనాడులో టాప్ ట్యాక్స్ పేయర్ రజినీకాంత్.. డబ్బు గురించి ఏమన్నారో తెలుసా?

బస్సు కండెక్టర్ స్థాయి నుంచి స్టార్ హీరో స్థాయికి ఎదిగిన స్ఫూర్తిప్రదాత. సౌత్ ఇండియా హీరోల్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆయనే తీసుకుంటారు.

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 03:00 PM IST

రజినీకాంత్.. సిసలైన హీరో!!
బస్సు కండెక్టర్ స్థాయి నుంచి స్టార్ హీరో స్థాయికి ఎదిగిన స్ఫూర్తిప్రదాత. సౌత్ ఇండియా హీరోల్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆయనే తీసుకుంటారు. తాజాగా తమిళనాడులో అత్యధిక ట్యాక్స్ పే చేసే వ్యక్తిగానూ రజినీకాంత్ కొత్త రికార్డు సృష్టించారు. దీంతో ఇటీవల ఇటీవల ఇన్కమ్ ట్యాక్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను సత్కరించింది. కొన్ని కారణాల వల్ల రజినీకాంత్ రాకపోవడంతో ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిధిగా హాజరవ్వగా.. ఆమె చేతుల మీదుగా రజినీకాంత్ తరపున ఐశ్వర్య జ్ఞాపిక అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలని ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ”అత్యధిక ట్యాక్స్ పే చేసే వ్యక్తికి కూతురిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. మా నాన్నని ఇలా సత్కరించినందుకు తమిళనాడు, పుదుచ్చేరి ఐటీ డిపార్ట్మెంట్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు” అని ఆమె తెలిపింది.

సంతోషం, ప్రశాంతత సంపాదించలేక పోయాను..

సినిమాలు లేనప్పుడు, ఖాళీగా ఉన్న సమయంలో రజినీకాంత్ హిమాలయాలకు వెళ్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఆధ్యాతికత అంటే రజినీకాంత్ కి చాలా ఇష్టం. ప్రశాంతత కోసం దైవారాధన చేస్తూ ఉంటారు. తాజాగా చెన్నైలో ‘హ్యాపీ సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ త్రూ క్రియా యోగ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు రజిని. రజినీకాంత్ ఈసందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ”నేను గొప్ప నటుడినని అందరూ అంటుంటారు. ఇది ప్రశంసో, విమర్శో నాకు అర్థం కాదు. నా సినీ జీవితంలో రాఘవేంద్ర, బాబా.. ఈ రెండు సినిమాలు ఆత్మ సంతృప్తిని కలిగించాయి. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలు వెళ్లామని, నా అభిమానులు కొందరైతే సన్యాసులుగా మారిపోయామని చెప్పారు. కానీ నేను మాత్రం ఇంకా ఇక్కడ నటుడిగానే కొనసాగుతున్నాను. హిమాలయాల్లో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయి. అవి తింటే వారానికి సరిపడా శక్తి లభిస్తుంది. ఆరోగ్యం మనిషికి చాలా ముఖ్యమైంది. అనారోగ్యానికి గురైతే మనకు కావాల్సిన వాళ్లు తట్టుకోలేరు. నేను నా జీవితంలో చాలా డబ్బు, పేరు, ప్రఖ్యాతలు సంపాదించాను. కానీ సంతోషం, ప్రశాంతత మాత్రం పది శాతం కూడా సంపాదించలేక పోయాను. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉండేవి కావు” అని
రజినీకాంత్ పేర్కొన్నారు. రజినీకాంత్ సంతోషంగా లేను అని అనడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.