Drones: ఇదేం గోలరా బాబు.. కింద రోడ్లే బాలేవు ఆకాశంలో డ్రోన్ ల కోసం ప్రత్యేకంగా హైవేలు?

రోజురోజుకి టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో వాహనాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 12:01 PM IST

రోజురోజుకి టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో వాహనాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా కూడా గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఎక్కడ చూసినా కూడా రోడ్డు యాక్సిడెంట్లు భారీగా జరుగుతున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదంలో కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అవతలి వ్యక్తి తప్పుగా డ్రైవింగ్ చేయడం వల్ల అనుకోకుండా ఇద్దరు ప్రాణాలు బలవుతున్నాయి.

అయితే మరి ఆకాశంలో డ్రోన్లు దూసుకుపోతుంటే ప్రమాదాలు జరగకుండా ఆపడం ఎలా అని సరికొత్త ఆలోచనను వెలుగులోకి తీసుకువచ్చారు బ్రిటన్ నిపుణులు. ఆకాశంలో నిర్ణీత ప్రాంతాన్ని సూపర్ హైవేగా ఉంచి ఆ మార్గం ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు బ్రిటన్ నిపుణులు. కాగా బ్రిటన్ కు చెందిన ఆల్టిట్యూడ్‌ ఏంజిల్‌, బీటీ తదితర సంస్థలు కలిసి ఓ కన్సార్షియంగా ఏర్పాటు అయ్యి ఆకాశంలో డ్రోన్ల కోసం సూపర్ హైవే లను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాయి. భూమి పై వాహనాలకు ఎక్కడికక్కడ సిగ్నళ్లు, ట్రాఫిక్ చిహ్నాలు ఎలా అయితే వాహనదారులని అప్రమత్తం చేస్తున్నాయో అదేవిధంగా ఆకాశ మార్గాన ప్రయాణించే డ్రోన్ల కు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డేటాను అందించేలా ఏర్పాట్లు చేశారు.

అయితే డ్రోన్ లు ఒకదానికొకటి ఢీ కొట్టుకోకుండా డీఏఏ అనగా డిటెక్ట్‌ అండ్‌ అవాయిడ్‌ అత్యాధునిక టెక్నాలజీని ఇందులో వినియోగించబోతున్నారు. డ్రోన్లు ప్రయాణించే ప్రాంతాల్లో పెద్ద పెద్ద టవర్లను ఏర్పాటు చేస్తారు. వాటిలో పలు రకాల సెన్సార్లను, పరికరాలను అమర్చుతారు. టవర్లలోని సెన్సార్లు నిరంతరం నిర్ణీత మార్గంలో ఎగురుతూ వెళుతున్న డ్రోన్లు, పక్షులు వంటి వాటిని పరిశీలిస్తూ ఉంటాయి. ఈ వివరాలను డ్రోన్లకు అందించి అవి ఢీకొట్టుకోకుండా జాగ్రత్తలను సూచిస్తాయి. ఈ సూచనలకు అనుగుణంగా డ్రోన్లు ప్రయాణ మార్గాన్ని సరిదిద్దు కోవడం, వేగంలో మార్పులు చేసుకోవడం జరుగుతుంది. మొత్తంగా మన ట్రాఫిక్ వ్యవస్థ తరహాలో ఇది పనిచేస్తుందన్న మాట.ప్రస్తుతం బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ తదితర నగరాల మీదుగా సుమారు 265 కిలోమీటర్ల పొడవున డ్రోన్ల సూపర్‌ హైవే ను ఏర్పాటు చేసేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. బ్రిటన్ ప్రభుత్వం దీనికి తాజాగా అనుమతి కూడా ఇచ్చింది.