Super Earth: జీవరాశులున్న మరో ‘సూపర్ ఎర్త్’ గుర్తించారహో.. !!

భూమి ఒక గ్రహం.. ఈ విశ్వంలో భూమిలాంటి గ్రహాలు మరెన్నో ఉన్నాయి. వాటిలో కనీసం కొన్ని చోట్ల మనుషులను పోలిన జీవరాశులు ఉన్నాయనే సందేహం శాస్త్ర ప్రపంచంలో ఉంది.

  • Written By:
  • Publish Date - August 6, 2022 / 06:30 AM IST

భూమి ఒక గ్రహం.. ఈ విశ్వంలో భూమిలాంటి గ్రహాలు మరెన్నో ఉన్నాయి. వాటిలో కనీసం కొన్ని చోట్ల మనుషులను పోలిన జీవరాశులు ఉన్నాయనే సందేహం శాస్త్ర ప్రపంచంలో ఉంది. ఈ సందేహానికి సమాధానాన్ని అన్వేషించే దిశగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఈక్రమంలో జపాన్ కు చెందిన “సుబరు టెలి స్కోప్” (Subaru Telescope) జీవరాశి ఉండే అవకాశమున్న ఒక గ్రహాన్ని గుర్తించింది. దానికి ” రొస్ 508 బీ” (Ross 508 b) అని పేరు పెట్టింది. సుబరు టెలిస్కోప్ లోని ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ ను ఉపయోగించి రొస్ 508 బీ(Ross 508 b) గ్రహాన్ని సుబరు స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ గుర్తించింది.భవిష్యత్‌లో జీవరాశి అన్వేషణ లక్ష్యంగా ఈ గ్రహంపై పరిశోధనలు జరిగే అవకాశం ఉందని పరిశోధక బృందం వెల్లడించింది.

“రొస్ 508 బీ” విశేషాలు..

* “రొస్ 508 బీ” గ్రహం మన భూమి నుంచి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని గుర్తించారు.
* Ross 508 b గ్రహం ద్రవ్యరాశి భూమి కంటే 4 రెట్లు అధికంగా ఉంది. అందుకే దీనిని ‘సూపర్-ఎర్త్’ గా పేర్కొంటున్నారు.
* పాలపుంతకు వెలుపల ఓ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ Ross 508 b గ్రహం తిరుగుతోంది. ఇది తన కక్ష్యను ఒక్కసారి చుట్టిరావడానికి కేవలం 10.8 రోజుల సమయం మాత్రమే పడుతోంది. అంటే 10.8 రోజుల్లోనే ఆ గ్రహంపై సంవత్సరం పూర్తవుతుంది.
* సూపర్ ఎర్త్ కు దాని నక్షత్రం మధ్య సగటు దూరం.. భూమి – సూర్యుడి మధ్యదూరం కంటే 0.05 రెట్లు ఎక్కువట.
* ఈ గ్రహంపై నీరు ఉండే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
* రొస్ 508 బీ గ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ తిరిగే అవకాశం ఉందంటున్నారు.

గోల్డీలాక్ జోన్స్ ?

గ్రహం ఉపరితలంపై ద్రవరూపంలో నీళ్లు ఉండే ప్రాంతాన్నే ఆవాసయోగ్య జోన్ గా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాలనే గోల్డీలాక్ జోన్స్ అని కూడా పిలుస్తారు. జీవం పుట్టేందుకు అనువైన ప్రదేశాలుగా భావిస్తారు. నక్షత్రం చుట్టూ ఉన్న ఈ గోల్డీలాక్స్ జోన్‌ ద్వారా రొస్ 508 బీ పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలు ?

జీవరాశి అన్వేషణలో రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలు చాలా కీలకం. వీటిపై పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నక్షత్రాల ఉపరితలంపై 4000 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. రొస్ 508 బీ మినహా ఇప్పటివరకు కనుగొన్న ఆవాసయోగ్య గ్రహాల్లో.. ‘ప్రొగ్జిమా సెంటౌరి బీ’ మాత్రమే ఉంది.