Sun : సూర్యుడి లైఫ్ టైం ముగిసేది ఎప్పుడో తెలిసిపోయింది!!

సూర్యుడికి వృద్ధాప్యం వచ్చిందా? నడి వయసులో ఉన్నాడా ? మునుపెన్నడూ లేని స్థాయిలో ఇప్పుడే సూర్యుడి లోపల సౌర తుఫానులు, విస్ఫోటనాలు ఎందుకు జరుగుతున్నాయి?

  • Written By:
  • Updated On - August 16, 2022 / 10:32 AM IST

సూర్యుడికి వృద్ధాప్యం వచ్చిందా? నడి వయసులో ఉన్నాడా ? మునుపెన్నడూ లేని స్థాయిలో ఇప్పుడే సూర్యుడి లోపల సౌర తుఫానులు, విస్ఫోటనాలు ఎందుకు జరుగుతున్నాయి? అనే ప్రశ్నలకు గైయ వ్యోమనౌక (Gaia spacecraft) సమాధానాలు దొరకబట్టింది. ఆ వివరాలతో కూడిన చిట్టాను ఈ ఏడాది జూన్ లోనే భూమికి పంపింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి అందిన ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇప్పుడు 457 కోట్ల ఏళ్ళు..

గైయ వ్యోమనౌక ప్రకారం.. ఇప్పుడు సూర్యుడి వయసు దాదాపు 4.57 బిలియన్ సంవత్సరాలు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. ఈ లెక్కన సూర్యుడి వయసు దాదాపు 457 కోట్ల సంవత్సరాలు. ఇది సూర్యుడి వృద్ధాప్య దశ కానే కాదని.. ప్రస్తుతం నడి వయసులో ఉన్నాడని నివేదిక పేర్కొంది. గత వారమే (ఆగస్టు మొదటి వారంలో) సూర్యుడు కొత్త సోలార్ సైకిల్ లోకి ప్రవేశించాడు. ఈక్రమంలో సూర్యుడి లోపల 17 కరోనల్ మాస్ ఎజెక్షన్ పేలుళ్లు జరిగాయి. సూర్యుడిపై ఉన్న 9 సన్ స్పాట్లలోనూ విస్ఫోటనాలు చోటుచేసుకున్నాయి. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత 3000 కెల్విన్స్ నుంచి 10,000 కెల్విన్స్ మధ్య ఉందని నివేదిక తెలిపింది. పాలపుంతలో సుదీర్ఘ కాలంగా సజీవంగా, క్రియాశీలకంగా ఉన్న నక్షత్రం సూర్యుడని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సూర్యుడి భవిష్యత్ ఇది..

గైయ వ్యోమనౌక అందించిన సమాచారం ఆధారంగా సూర్యుడిలో భవిష్యత్ లో చోటుచేసుకునే మార్పులపై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు కొన్ని అంచనాలకు వచ్చారు. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత భవిష్యత్ లో మరింత పెరుగుతుందని, వయసు 800 కోట్ల ఏళ్లకు చేరే సమయానికి ఉపరితల ఉష్ణోగ్రత అత్యంత గరిష్ట స్థాయికి చేరుతుందని తెలిపారు. ఆ తర్వాతి నుంచి మళ్ళీ సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని విశ్లేషించారు. చివరకు లక్ష కోట్ల ( 1011 బిలియన్ ) ఏళ్ళు దాటిన తర్వాత సూర్యుడు జీవిత చరమాంకంలోకి ప్రవేశిస్తాడని అంచనా వేశారు. ఆ సమయానికి సూర్యుడు కాంతిని, తేజాన్ని కోల్పోయి.. కాంతివిహీనమైన చిన్న నక్షత్రం సైజుకు తగ్గిపోతాడని పేర్కొన్నారు.