Site icon HashtagU Telugu

Taliban : పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి

Suicide attack in Pakistan.. 16 soldiers killed

Suicide attack in Pakistan.. 16 soldiers killed

Taliban : పాకిస్థాన్‌లో మళ్లీ భీకరమైన ఉగ్రవాద దాడి చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది పాకిస్థాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పౌరులతో పాటు 24 మందికిపైగా గాయపడ్డారు. ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. ప్రాంతీయ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వేగంగా నడుపుతూ సైనిక కాన్వాయ్‌ను ఢీకొట్టాడు. భారీ శబ్దంతో జరిగిన పేలుడుతో సైనిక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.

Read Also: Pawan Kalyan : మహా న్యూస్ చానల్ పై దాడిని ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఘటన అనంతరం మృతుల సంఖ్య మొదట్లో 13గా ప్రకటించబడినా, చికిత్స పొందుతూ మరణించిన వారితో అది 16కి చేరిందని అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం ప్రారంభించాయి, అలాగే గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ ఉగ్రవాద సంస్థలోకి చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రకటించింది. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో ఇటువంటి దాడులు పెరిగిపోయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఇప్పటికే పలుమార్లు ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉపయోగిస్తూ ఉగ్రవాదులు తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. అయితే కాబూల్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది.

ఈ ఏడాది ప్రారంభం నుంచే ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్థాన్ ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందిపై ఉగ్రవాద దాడులు తీవ్రమవుతున్నాయి. ఫ్రాన్స్‌కు చెందిన వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025 మొదటి అర్థభాగంలో దాదాపు 290 మంది ఈ ప్రాంతాల్లోని హింసాత్మక ఘటనల్లో మృతి చెందగా, వీరిలో చాలా మంది భద్రతా బలగాలకు చెందిన వారే ఉన్నారు. తాజా ఘటన వెలుగులోకి రావడంతో సరిహద్దు భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం దేశ భద్రతను మరింత బలపర్చే చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read Also: Telangana : తెలంగాణలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్