Bangalore : ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మే 5న జరిగిన ఈ విషాదకర సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాదం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసుల చర్యలు, అధికారుల సస్పెన్షన్లు చోటుచేసుకోగా.. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం కేఎస్‌సీఏ కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరామ్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. మా పాత్ర పరిమితమైనదైనా, నైతిక బాధ్యత తీసుకుంటూ రాజీనామా చేస్తున్నాం అని వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తమ రాజీనామా లేఖలను కేఎస్‌సీఏ అధ్యక్షుడికి అందజేశామని తెలిపారు.
Read Also: Mobile Number With Aadhaar: ఆధార్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయకపోతే కలిగే నష్టాలివే!
ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్, కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్‌లపై బాధ్యత వహిస్తూ కేసు నమోదు చేశారు. దీనితో పాటు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్‌ను సస్పెండ్ చేయగా, సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. మరికొందరు ఉన్నతాధికారులపై బదిలీ లేదా సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెతో పాటు డీఎన్‌ఏ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి పై విచారణ కొనసాగుతున్నప్పటికీ, అక్రమంగా తమపై కేసులు పెట్టారని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) హైకోర్టును ఆశ్రయించింది. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులు, ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను జూన్ 13వ తేదీకి వాయిదా వేసింది.
ఆర్సీబీ విజయోత్సవం పేరుతో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు భారీగా అభిమానులు చేరడంతో అపసవ్యం జరిగింది. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. అప్పటివరకు ఉత్సాహంగా సాగుతున్న వేడుకలు క్షణాల్లో విషాదంగా మారాయి. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు చేపట్టినప్పటికీ, ఇదంతా బలహీన నిర్వహణకు నిదర్శనంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటన నేపథ్యంలో క్రికెట్ సంఘంలో భద్రతపై తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా కఠినమైన మార్గదర్శకాలు రూపొందించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కాగా, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, కేఎస్‌సీఏలో రాజీనామాలు, పోలీసులు చేపట్టిన అరెస్టులు, అధికారులపై చర్యలు కలకలం సృష్టిస్తున్నాయి. బాధ్యులపై శిక్షలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read Also: Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ..పలుకీలక అంశాలపై చర్చ