Site icon HashtagU Telugu

Sri Sri Daughter: మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ‘శ్రీశ్రీ కుమార్తె’

Sri Sri

Sri Sri

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహిళా మణులుగా పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడదే జరిగింది. తెలుగువారికి తన రచనలతో సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమార్తె నిడుమోలు మాలాను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. సుప్రీంకోర్టు కొలీజియం ఆరుగురి పేర్లను పంపిస్తే.. అందులో ఇద్దరి పేర్లకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వారిలో మాలా ఒకరు. శ్రీశ్రీకి నలుగురు కుమార్తెలు. వారిలో మాలా చిన్నవారు. 32 సంవత్సరాల నుంచి మద్రాస్ హైకోర్టులోనే లాయర్ గా ఉన్నారు. మాలా చదువుకున్నది కూడా మద్రాస్ లా కాలేజ్ లోనే. అక్కడే ఆమె డిగ్రీ పూర్తిచేశారు. మద్రాస్-పుదుచ్చేరి బార్ అసోసియేషన్ లో సభ్యురాలిగా 1989లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. మాలా 2020 నుంచి పుదుచ్చేరి ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు.

మాలా కుటుంబానిది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా. ఆమె భర్త పేరు నిడుమోలు రాధారమణ. ఆయన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లో ఉన్నతోద్యోగి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దవాడైన శ్రీనివాస్ జయప్రకాశ్.. హైకోర్టులో లాయర్ గా ఉన్నారు. దేశంలో ఐదు హైకోర్టుల్లో మొత్తం 9 మందిని జడ్జ్ లుగా నియమించింది సుప్రీంకోర్టు కొలీజియం. ఈ 9 మందిలో ఆరుగురు న్యాయవాదులు కాగా.. మిగిలిన ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు. శ్రీశ్రీ గురించి తెలుగునాట తెలియనివారు ఉండరు. ఆయన రాసిన ప్రతీ అక్షరం.. సమాజాన్ని జాగృతం చేసేదే. తెలుగు రచయితల్లో సుప్రసిద్దులుగా ఇప్పటికీ మంచి పేరుంది. ఆయన రాసిన పుస్తకాలు యువ రచయితలకు ఇప్పటికీ మార్గదర్శకంగా ఉపయోగపడతాంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆయన కుమార్తె.. ఈరోజు ఇంతటి ఉన్నతస్థాయికి ఎదిగారు.

Exit mobile version