APSRTC Special : ఆషాఢ మాసంలో ఏటా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఈ ఏడాది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జూన్ 27న జరిగే రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక బస్సులు ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బయలుదేరతాయి. జూన్ 26న యాత్రలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశముంటుంది. ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, అనంతరం సింహాచలం వరాహలక్ష్మీనరసింహ స్వామి ఆలయ దర్శనాలు ఉంటాయి. సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ వద్ద భక్తులు కాసేపు విహరించనున్నారు. అక్కడి నుంచి రాత్రి 6 గంటలకు బస్సులు మళ్లీ బయలుదేరి పూరీ వైపు సాగుతాయి.
Read Also: Putin : జెలెన్‌స్కీను కలిసేందుకు సిద్ధమే.. కానీ ఇప్పుడు కాదు: పుతిన్
జూన్ 27న కోణార్క్ సూర్య దేవాలయం సందర్శన తర్వాత, పూరీ చేరుకున్న భక్తులు జగన్నాథ స్వామి, బాలభద్రుడు, సుభద్రామ్మల రథయాత్రలో పాల్గొననున్నారు. రాత్రి ఒంటిగంటవరకూ పూరీలోనే ఉండే అవకాశం కల్పించారు. అనంతరం బస్సులు తిరిగి విజయవాడకు మళ్లిస్తాయి. రావులపాలెం డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటుంది. జూన్ 26న బయలుదేరే ఈ సూపర్ లగ్జరీ బస్సు, పూరీ రథోత్సవం సందర్శించడంతో పాటు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం, కోణార్క్ ఆలయం, భువనేశ్వర్ మరియు సింహాచలం ఆలయాలను దర్శించే అవకాశం కల్పిస్తుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 29న రావులపాలెం చేరుకుంటుంది. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులను రథయాత్రకు నడపడానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్ర రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్, బస్సు యజమానుల సంఘం కార్యవర్గంతో సమావేశం నిర్వహించి, బస్సులకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. మాలతీపట్టపూర్, తొలబొణియా మైదానాల్లో బస్సులను నిలిపి, అక్కడి నుంచి 100 ఆటోల సాయంతో భక్తులను రథయాత్ర ప్రదేశానికి తరలించనున్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ ధరలకు కట్టుబడి ఉండాలని, భక్తుల నుంచి అధిక వసూలు చేయరాదని ఆటో, బస్సు డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. తొలబొణియా బస్ స్టాప్ వద్ద భక్తులకు కేవలం రూ.10కే శాఖాహార భోజనం అందుబాటులో ఉంచనున్నారు. భువనేశ్వర్ – పూరీ, పూరీ – కోణార్క్, పిప్పిలి – పూరీ వంటి కీలక రూట్లలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు జిల్లా పోలీసులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల రద్దీ నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా, పూరీ జగన్నాథుని రథయాత్రను భక్తులు ప్రశాంతంగా, భద్రతతో అనుభవించేందుకు APSRTCతో పాటు ఒడిశా ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసింది.
.సూపర్ లగ్జరీ, హైటెక్ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.3,600
.ఇంద్ర ఏసీ ఒక్కొక్కరికీ రూ.4,800 చెల్లించాల్సి ఉంటుంది
.ఆన్లైన్ ద్వారా కానీ ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు
.30మంది గ్రూ ప్ గా ఉన్నట్టయితే వారి నివాస ప్రాంతం నుంచే బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆర్టీసీ అధికారులు
.ప్రయాణంలో భోజనం, ఇతర ఖర్చులన్నీ ప్రయాణికులవే.
.తిరువూరు, జగ్గయ్యపేట నుంచి రథయాత్రకు వెళ్లేవారి సంక్య 30 మంది ఉన్నట్టైతే అక్కడి నుంచి కూడా బస్సులు .ఏర్పాటు చేస్తామన్నారు.
.పూర్తి వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు ఇవే…
807429 8487 , 9515860465, 8247451915 , 73828931 97