Snake bites a girl: 7 నెలల్లో 3 సార్లు పాము కాటు.. ఆ డిగ్రీ విద్యార్థినిపై పాము పగబట్టిందా? చివరకు ఏం జరిగింది?

  • Written By:
  • Publish Date - March 20, 2022 / 11:23 AM IST

పాములు పగబడతాయని చాలా మంది సినిమాల్లో చూసుంటారు. అక్కడక్కడ కథలు కూడా చదువుతారు. పెద్దవాళ్లు చెప్పగా విని ఉంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉన్న బెదోడ గ్రామ వాసులు పాము పగను కళ్లారా చూశారు. ఒక పాము ఎవరి మీద అయినా పగపడితే ఎలా కాటు వేస్తుందో వారికి అర్థమైంది. ఎంత కాలమైనా సరే.. అది వారిని విడిచి పెట్టదని అంటున్నారు. దీనికి ప్రణాళి మృతిని సాక్ష్యంగా చూపిస్తున్నారు.

రైతు భలేరావు సుభాష్ కు ఒక్కగానొక్క కుమార్తె. ఆమే.. 18 ఏళ్ల ప్రణాళి. చాలా చురుకైన విద్యార్థిని. చాలా కష్టపడి చదువుతుంది. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలని ఎన్నో కలలు కంది. కానీ ఆ పాము మాత్రం ఆమె ఆశలను, ఆశయాలను నెరవేరనియ్యలేదు. అంటే.. పాము రూపంలోనే ఆమెను మృత్యువు పొట్టనబెట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు ఆమెను కాటేసింది.

ప్రణాళి.. ఆదిలాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఏడు నెలల వ్యవధిలో మూడు సార్లు పాము కాటుకు గురైంది. కిందటేడాది ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో.. ఆమె చేతిపై పాము.. కాటు వేసింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. కానీ దాని కోసం దాదాపు రూ.4 లక్షలను ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తానికి డాక్టర్లు.. ఆమె ప్రాణాలను కాపాడగలిగారు.

ఈ ఏడాది జనవరిలో ఇంటి ముందు కూర్చుని ఉన్న సమయంలో పాము వచ్చి కాటేసింది. దీంతో భయపడ్డ ఆమె కుటుంబం మళ్లీ చికిత్స చేయించింది. రెండుసార్లు పాము కాటుకు గురవ్వడంతో ప్రణాళి తల్లిదండ్రులు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంటి నుంచి బయటకు పంపించడానికి భయపడేవారు. అందుకే ఆమెను ఇంటికే పరిమితం చేశారు.

హోలీ పండుగ కదా అని స్నేహితులతో కలర్స్ ఫెస్టివల్ జరుపుకోవడానికి ప్రణాళి సిద్ధమైంది. తన కాలేజ్ బ్యాగులో ఉన్న రంగులను బయటకు తీయాలనుకుంది. వాటికోసం బ్యాగులో చేయిపెట్టగానే.. అక్కడ అప్పటికే పొంచి ఉన్న పాము.. ఒక్కసారిగా ఆమెను కాటు వేసింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు.. వెంటనే రిమ్స్ హాస్పటల్ కు తీసుకువెళ్లారు. గతంలో రెండుసార్లు మృత్యువు ముంగిటవరకు వెళ్లి దానితో పోరాడి ప్రాణాలను నిలబెట్టుకోగలిగింది. కానీ మూడోసారి మాత్రం ఆమె ప్రయత్నం నెరవేరలేదు. ఆమె తల్లిదండ్రుల ప్రార్థనలు ఫలించలేదు. చికిత్సను తీసుకుంటుండగానే ప్రణాళి ప్రాణాలు కోల్పోయింది.

ఒక్కగానొక్క కూతురు.. కంటికి రెప్పలా చూసుకున్నారు. అల్లారుముద్దుగా పెంచారు. రెండుసార్లు పాము కాటేసినా సరే కాపాడుకున్నారు. కానీ మూడోసారి తమపై భగవంతుడు దయ చూపలేదంటూ ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. గతంలో రెండుసార్లూ పౌర్ణమి రోజునే ఆ పాము.. ప్రణాళిని కాటేసింది. మూడోసారి మాత్రం అమావాస్య రోజున కాటేసింది. దీనికి కారణాలు తెలియకపోయినా.. ప్రణాళిపై పాము పగబట్టిందంటూ ఆమె కుటుంబం రోదిస్తోంది.