Sim Card – New Rules : ఈరోజు డిసెంబరు 1. ఇవాళ్టి నుంచి కొత్త సిమ్ కార్డుల అమ్మకాలు, యాక్టివేషన్‌కు సంబంధించిన నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్థిక మోసాలను నిరోధించేందుకు, సిమ్ కార్డు యూజర్ల భద్రతను పెంచేందుకు, వెరిఫికేషన్‌ను పక్కాగా చేసే లక్ష్యంతో కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. తద్వారా ఫేక్ సిమ్ కార్డుల అమ్మకాలకు కళ్లెం వేయాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ఈ కొత్త రూల్స్‌తో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
కొత్త రూల్స్ ఎఫెక్ట్ ఇదీ..
- ఇక నుంచి కొత్త సిమ్ కొనుగోలు, సిమ్ రీప్లేస్‌మెంట్, సిమ్ పోర్టబిలిటీ సహా అన్ని సిమ్ కార్డ్ లావాదేవీలకు నో యువర్ కస్టమర్ (KYC) ప్రక్రియను పూర్తిచేయడం తప్పనిసరి. ఇందులో భాగంగా కస్టమర్ తన ఆధార్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలను సమర్పించాలి. ఫింగర్‌ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ ఉపయోగించి బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేయాలి.
- కొత్త నిబంధనల ప్రకారం ఇకపై వ్యక్తులు లేదా సమూహాలు సిమ్ కార్డ్‌లను పెద్దమొత్తంలో కొనడంపై బ్యాన్ అమల్లో ఉంటుంది.తద్వారా స్పామింగ్, ఫిషింగ్ లేదా స్కామ్ వంటి చట్టవిరుద్ధమైన లేదా మోసపూరిత ప్రయోజనాల కోసం సిమ్ కార్డ్‌లను వాడే వీలుండదు. అయితే వ్యాపారం, కార్పొరేట్ ప్రయోజనాలు, ఈవెంట్ ప్రయోజనాల కోసం సిమ్ కార్డ్‌లను పెద్ద సంఖ్యలో కొనొచ్చు. ప్రస్తుత లిమిట్ ప్రకారం, కస్టమర్ ఒక ఐడీ కార్డ్‌పై 9 సిమ్ కార్డ్‌ల వరకు కొనుగోలు చేయొచ్చు.
- ఫేక్ లేదా దొంగతనానికి గురైన సిమ్ కార్డ్‌లను విక్రయించడం లేదా కస్టమర్ డేటాను దుర్వినియోగం చేయడం వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో పాల్గొనకూడదనే నిబంధనపై టెలికాం ఏజెంట్లు, పాయింట్-ఆఫ్-సేల్ (PoS) ఏజెంట్లు టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ ఒప్పందాన్ని కేంద్ర టెలికాం శాఖతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ ఈ ఒప్పందాన్ని పీఓఎస్ ఏజెంట్ ఉల్లంఘించినట్లు తేలితే, వారు రూ.10 లక్షల జరిమానా చెల్లించుకోక తప్పదు. మూడేళ్లపాటు సర్వీస్ రద్దు అవుతుంది.
- ప్రస్తుతం ఉన్న పీఓఎస్ ఏజెంట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు డిసెంబర్ 1 నుంచి 12 నెలల గడువు(Sim Card – New Rules) ఉంటుంది.