Pahalgam Terror Attack : కేంద్ర ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఆ దేశాన్ని అన్నివైపుల నుంచి దిగ్బంధించేలా చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో పాక్‌కు ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా, ఉత్పత్తుల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్‌పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్‌ను కోరింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాక్ 38వ స్థానంలో ఉంది. మేము పాకిస్థాన్‌కు ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తుల డేటాను కోరాం. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఫార్మెక్సిల్) ఆ దిశగా పనిచేస్తోంది. త్వరలో వివరాలు పంపుతోంది అని ఓ సీనియర్ అధికారి జాతీయ మీడియాకు వెల్లడించారు.
Read Also: Jeera: జీలకర్రను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో మీకు తెలుసా?
భారత్ నుంచి పాక్‌కు ఎగుమతి అయ్యే వస్తువుల్లో అతి ముఖ్యమైనవి ఔషధాలు. ఇప్పుడు ఆ ఔషధాల సరఫరా నిలిచిపోతే పాకిస్తాన్‌కు చావు దెబ్బ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఔషధ పరిశ్రమలో ఉపయోగించే ముడి పదార్థాల్లో 30 శాతం నుంచి 40 శాతం వరకు భారత్ నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడి పనిచేస్తోంది. ఇందులో ముఖ్యంగా క్రియాశీల ఔషధ పదార్థాలు, క్యాన్సర్ చికిత్సలు, జీవ ఉత్పత్తులు, టీకాలు, రాబిస్ నిరోధక వ్యాక్సిన్, పాము కాటుకు వాడే ఔషదాలు ఉన్నాయి. కాగ, పాకిస్థాన్‌కు దుబాయ్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. భారత్ నుంచి యూఏఈకి ఎగుమతి అయ్యే ఔషధాలను తిరిగి పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటుంది. ఈ వాణిజ్య సంబంధాలను భారత్ తెంచుకోవడం ద్వారా పాక్‌పై తీవ్ర ప్రభావం పడనుంది అని మరో అధికారి అంచనా వేశారు.
మరోవైపు భారత్ నుంచి దిగుమతి అయ్యే ఔషధాలపై నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ తెలిపింది. అందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రెడీగా ఉన్నాయని పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ(డీఆర్ఏపీ) వెల్లడించింది. ఇక, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్ర ఒత్తిడికి గురికావడం ఇదే తొలిసారి కాదు. బాలాకోట్ వైమానిక దాడులు, ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా ఈ పరిస్థితులు కనిపించాయి. ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది.