జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Vs Centre) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై విచారణ జరిగి ఉంటే అప్పటి హోం మంత్రి (రాజ్‌నాథ్‌సింగ్) రాజీనామా చేయాల్సి వచ్చేదన్నారు. అనేక మంది అధికారులు జైలు పాలయ్యే వారని, విషయం వివాదాస్పదం అయ్యేదని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల పోరు మన సైనికుల శవాలపై నే జరిగిందని ఆయన ఆరోపించారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా బన్సూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాలిక్ (Satyapal Vs Centre) ఈ కామెంట్స్ చేశారు.
‘‘ఉగ్రదాడి జరిగిన రోజు (2019 ఫిబ్రవరి 14న) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కు పర్యటనలో ఉన్నారు. ఆయన పార్కు నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేశాను. మన పొరపాటు వల్ల సైనికులు మరణించారని చెప్పాను. దీంతో ఆయన నాకు మౌనంగా ఉండమని చెప్పారు’’ అని సత్యపాల్ మాలిక్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన సత్యపాల్ మాలిక్ .. ఒకవేళ మీరు మళ్లీ వాళ్లకు ఓటేస్తే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్నే కోల్పోతారని సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు.