Saraswati River Pushkaralu : శ్రీ విశ్వావసు నామ సంవత్సర వైశాఖ కృష్ణ విదియ బుధవారం తేది 14-05-2025 రాత్రి 10-32 గంటలకు దేవ గురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మే 15 గురువారం నాడు సార్ధ త్రికోటి తీర్థ సహిత సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 26 వరకు ఇవి కొనసాగుతాయి. మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా నిర్వహిస్తారు. ఈ 12 రోజుల పుష్కర సమయంలో తల్లిదండ్రులు గతించిన వారు, పితృ దేవతల ప్రీత్యర్థం స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు ఆచరించాలని శాస్త్రం చెబుతున్నది. తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు నదిలో స్నానం ఆచరించి యథాశక్తి దానం చేస్తే పుణ్యప్రదమని శాస్త్ర వచనం.
Read Also: One State One RRB : మే 1 నుంచే ‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బీ’.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్
ఈ పుష్కరాల కోసం దేవాదాయ శాఖ రూ.25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది పుష్కరాలకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2025 మే 15న సూర్యోదయంతో పుష్కర పుణ్యస్నానాలు ప్రారంభమవుతాయి.. మే 26 వరకు కొనసాగుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పుష్కరాలకు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున వారి కోసం స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు.
సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ సింధుశాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం ఉంది కానీ ఇక్కడ సరస్వతి నది అంతర్వాహిని. ఇంకా గుజరాత్ దగ్గర సిద్ధపూర్, మానా దగ్గర కూడా సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ముక్తీశ్వర లింగానికి వున్న నాసిక రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదిరూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందని చెబుతారు. అందుకే సరస్వతీ నదికి గుప్త కామినీ అనే మరో పేరుంది.
ఇక, బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు క్రమ పద్ధతిలో పుష్కరాలు జరిగేలా రూపొందించారు పండితులు. గురువు మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి, వృషభ రాశిలో ప్రవేశి స్తే నర్మదానది, మిథునంలో ప్రవేశిస్తే సరస్వతి, కర్కాటకంలో ఉన్నప్పుడు యమునానది, సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి..ఇలా ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి. అలా ఈ ఏడాది సరస్వతీ నది పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు జరుగుతాయి.
కాగా, పుష్కరుడు అనే బ్రాహ్మణుడు పూర్వం శివుడి కోసం తపస్సు చేశాడు. పుష్కరుడుభక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. ఓ దేవా జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారు ఆ శరీర స్పర్శతో నదులు పునీతం అయ్యేలా వరం ఇమ్మని అడిగాడు. నువ్వు ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నది పునీతం అవుతుందనే వరం ఇచ్చాడు శివుడు. అలా పుష్కరుడు ఏడాదికి ఓనదిలో ప్రవేశిస్తాడు. అది కూడా బృహస్పతి రాశి మారిన సమయంలో. ఏడాదికి ఓ రాశిలోకి పరివర్తనం చెందుతాడు బృహస్పతి.