Delhi University : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, పౌర హక్కుల ఉద్యమకారుడు జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే సాయిబాబా మృతదేహాన్ని ఆయన కోరుకున్న విధంగా మెడికల్ కాలేజీకి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మావోయిస్టు సంబంధాలు ఉన్నాయన్న అభియోగాల కేసులో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో మార్చి నెలలో ఆయన విడుదలయ్యారు. సాయిబాబా భౌతికకాయాన్ని ఆయన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయన కళ్లను ఇప్పటికే ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Also: Narendra Modi : గతి శక్తి అనుభూతి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన మోదీ
సాయిబాబా మృతిపట్ల ‘ఎక్స్’ వేదికగా ప్రముఖలు సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతి పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం తెలిపారు. ” మానవ హక్కుల ఉద్యమకారుల సంఘానికి సాయిబాబా మరణం తీరని లోటు. అణగారిన ప్రజలకు జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా, స్వేచ్ఛకు ముప్పు ఏర్పడినప్పుడు ఆయన అవిశ్రాంతంగా పోరాడారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పౌర హక్కులను కాపాడటంలో ఆయన చూపిన ధైర్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా”అని ఎక్స్‌లో తెలిపారు.