Site icon HashtagU Telugu

Sachkhand Express: ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందించే రైలు గురించి మీకు తెలుసా !

Sachkhand Express

Sachkhand Express

రైలులో మంచి ఆహారం లభిస్తే అంతకుమించిన ఆనందం ఉండదు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటప్పుడు వేడివేడిగా అందించే భోజనం చేస్తూ ప్రయాణించడంలో ఉండే ఆ మజానా వేరు. దూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల ఆకలి బాధ తీర్చేందుకు ప్యాంట్రీ కార్ ఉంటుంది. కొందరు స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు అవసరమైన ఆహారాన్ని కొనుక్కుంటారు. అయితే, ఇందుకు మనము డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ప్రయాణికులకు పూర్తి ఉచితంగా ఆహారాన్ని అందించే రైలు ఒకటి మన దేశంలో ఉందన్న సంగతి మీకు తెలుసా? ఈ రైలు పేరు సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ (12715). ఈ రైలులో ప్రయాణం మొత్తం వేడివేడి ఆహార పదార్థాలను ఉచితంగా అందిస్తారు. ఇది అమృత్‌సర్-నాందేడ్ మధ్య ప్రయాణిస్తుంది. సిక్కుల పవిత్ర స్థలాలైన అమృత్‌సర్‌లోని శ్రీ హర్‌మందిర్ సాహిబ్, నాందేడ్‌లోని శ్రీ హజూర్ సాహిబ్ మధ్య మొత్తం 2,081 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. ఆరు స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం సరఫరా చేస్తారు.

రెండు దశాబ్దాలుగా అందిస్తున్న లంగర్ (కమ్యూనిటీ కిచెన్) కారణంగానే ఉచిత ఆహారం వీరికి సాధ్యమైంది. ఆహారం కోసం ఎగబడకుండా రద్దీని నివారించేందుకు రైలు ఈ స్టేషన్లలో ఎక్కువ సేపు ఆగుతుంది. ఆహారాన్ని స్వీకరించేందుకు ప్రయాణికులు తమ సొంత పాత్రలను తీసుకొస్తారు. అందించే ఆహారంలో కథీ చావల్, దాల్, సబ్జీ వంటి నోరూరించే శాకాహార భోజనం ఉంటుంది.

రైలులో ప్యాంట్రీ కోచ్ ఉన్నప్పటికీ, ప్రతి ప్రయాణికుడికి లంగర్ (ఆహారం) అందిస్తారు కాబట్టి అందులో ఆహారం వండరు. కాగా, ప్రతి రోజూ 2 వేల మందికి ఉచిత భోజనం లభిస్తుంది. 1995లో అంటే దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ ఉచిత భోజన సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటికి అది కొనసాగుతోంది. లక్షలాదిమంది ఈ ఉచిత భోజనం అందుకున్నారు.