Russia War : ఉక్రెయిన్ జర్నలిస్ట్ ను సజీవదహనం చేసిన రష్యా ఆర్మీ

రష్యా దళాలు ఉక్రెయిన్ లో మ్యాక్స్ లెవిన్ అనే ఫోటో జర్నలిస్ట్ ను సజీవ దహనం చేసిన ఘటన మూడు నెలలు ఆలస్యంగా వెలుగు చూసింది

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 07:00 AM IST

రష్యా దళాలు ఉక్రెయిన్ లో మ్యాక్స్ లెవిన్ అనే ఫోటో జర్నలిస్ట్ ను సజీవ దహనం చేసిన ఘటన మూడు నెలలు ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చి 13న మ్యాక్స్ లెవిన్, అతడి స్నేహితుడైన ఉక్రెయిన్ సైనికుడు ఒలెక్సి చెర్నిషాప్ మిస్ అయ్యారు. దీనిపై రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (ఆర్ ఎస్ ఎఫ్) సంస్థ పరిశోధన చేసింది. ఒక ప్రత్యేక టీమ్ ను ప్యారిస్ నుంచి ఉక్రెయిన్ కు పంపింది. ఈ టీమ్ మే, జూన్ నెలల్లో కీవ్ శివారు ప్రాంతాలను జల్లెడ పట్టింది. మొష్ చున్ అనే గ్రామం శివారులో ఫోటో జర్నలిస్ట్ మ్యాక్స్ లెవిన్ , ఉక్రెయిన్ సైనికుడు ఒలెక్సి చెర్నిషాప్ లను అదుపులోకి తీసుకున్న రష్యా సైన్యం తొలుత ఇంటరాగేట్ చేసిందని గుర్తించారు. ఇంటరాగేట్ చేశాక సజీవదహనం చేసినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఆ తర్వాత వారి మృతదేహాలపై కాల్పులు కూడా జరిపినట్లు తేలింది. ఘటనా స్థలిలో లభించిన బుల్లెట్లు, మందుగుండు, సిగరెట్లు రష్యా సైన్యం వాడేవేనని పేర్కొన్నారు. ఈ ఆధారాలతో కూడిన దర్యాప్తు నివేదికను ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం లో సమర్పించారు. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈవిధంగా 8 మంది ఉక్రెయిన్ జర్నలిస్టులను రష్యా సైన్యం చంపిందని దర్యాప్తు నివేదిక లో ప్రస్తావించారు.