Dhoni @Rs 40: మోకాళ్ళ నొప్పుల కోసం.. ధోనీకి రూ.40 నాటు వైద్యం!

ధోనీ .. క్రికెట్ గ్రౌండ్ లో చిరుతలా పరుగెత్తుతాడు.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 09:30 PM IST

ధోనీ .. క్రికెట్ గ్రౌండ్ లో చిరుతలా పరుగెత్తుతాడు. బంతిని పట్టుకోవడానికి కావచ్చు.. పరుగులు తీయడానికి కావచ్చు.. ఏ విషయంలోనైనా ధోనీది యమ స్పీడు. విశ్రాంతి లేకుండా ఐపీఎల్ టోర్నీల్లో ఆడుతున్న ధోనీ.. మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నాడు. ఆ నొప్పులకు ట్రీట్ మెంట్ కోసం ఆయన పెద్ద పెద్ద హాస్పిటల్స్ కు వెళ్లకుండా.. చెట్టు కింద కూర్చునే నాటు వైద్యుడితో చికిత్స చేయించుకున్నాడు. ఇందుకోసం ధోనీ జార్ఖండ్ రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంపంగ్ గ్రామ నాటు వైద్యుడు వందన్ సింగ్ ఖర్వార్ దగ్గరికి వెళ్లారు. గతంలో ధోని తల్లిదండ్రులకు కూడా మోకాళ్ల నొప్పులు రాగా.. ఈ నాటు వైద్యుడి దగ్గరే మూలికా వైద్యం చేయించుకున్నారు. దీంతో ధోని కూడా అదే బాట పట్టారు. ఆయనను పరీక్షించిన నాటు వైద్యుడు.. శరీరంలో కాల్షియం లోపం ఉన్నందునే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పారట.
ధోనీ ఇప్పటికే నాలుగు డోసుల మూలికా ఔషధం తీసుకున్నారని తెలుస్తోంది. ఒక్కో డోస్‌ ధర కేవలం రూ. 40 మాత్రమేనట. ఈక్రమంలో జూన్ 26న ఆ ఊరి వాళ్ళతో ధోనీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వందల కోట్ల ఆస్తి కలిగిన ధోనీ.. మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవడం కోసం రూ.40 రూపాయల నాటు వైద్యం చేయించుకోవడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

నాటు వైద్యుడు ఏమన్నాడంటే..

‘ ఎంఎస్ ధోనీ నా దగ్గరికి వచ్చిన తొలిసారి గుర్తు పట్టలేకపోయా. సాధారణ వ్యక్తిలాగే వచ్చి మోకాళ్ళ నొప్పుల సమస్య గురించి చెప్పాడు. మందు ఇస్తే తిన్నాడు. ఒక్కో డోస్‌కి 40 రూపాయలు ఇచ్చాడు. ధోనీ కారును చూసి పక్కనే ఉన్న అబ్బాయిలు అరిచారు. అప్పుడు కానీ విషయం తెలియలేదు. మోకాళ్ల నొప్పికి చికిత్స కోసం ధోనీ తల్లిదండ్రులు గతంలో నా వద్దకు వచ్చారు. వారికి ఉపశమనంగా అనిపించడంతో మహీ కూడా వస్తున్నాడు’ అని నాటు వైద్యుడు వందన్ సింగ్ చెప్పారు.