Robo: దక్షిణ కొరియాలో దారుణం, మనిషిని చంపేసిన రోబో

టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 01:00 PM IST

Robo: టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. దక్షిణ కొరియాలో ఓ రోబో మనిషిని చంపేసింది.  ఓ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలో రోబో పనితీరును పరీక్షించటానికి ఓ వ్యక్తి వచ్చాడు. కూరగాయలతో ప్యాక్‌ చేసిన బాక్సులను కన్వేయర్‌ బెల్ట్‌ మీదికి చేర్చే రోబోను పరీక్షిస్తున్నాడు.

అయితే రోబోలోని సెన్సర్లలో సమస్య తలెత్తింది. దీంతో రోబో ఆ వ్యక్తిని కూడా కూరగాయాల బాక్సుగా భావించింది. అంతే.. అతడిని ఎత్తికన్వేయర్‌ బెల్ట్‌ మీద అదిమి పెట్టేసింది. దీంతో ఆ వ్యక్తి ముఖం, ఛాతీ భాగం తీవ్రంగా నలిగిపోయాయి. దాంతో ఒక్కసారిగా అంతా అలర్టయ్యారు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.

అయితే ఫ్యాక్టరీలో రోబో మనుషుల ప్రాణాలకు హాని తలపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో దక్షిణ కొరియాలోని గున్సాన్‌లోని ఆటో విడిభాగాల కర్మాగారంలో మ్యానుఫ్యాక్చరింగ్ రోబో కారణంగా ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గతేడాది ప్యోంగ్‌టెక్‌లోని మిల్క్ ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిని రోబో నలిపేసి చంపేసింది. 1992, 2017 మధ్య యునైటెడ్ స్టేట్స్‌లో వర్క్‌ప్లేస్ రోబోలు కనీసం 41 మరణాలకు కారణమయ్యాయని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దక్షిణ కొరియాలో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.