Revlon : మన్మథుడులో హీరో నాగార్జున యాడ్ చేసిన రెవ్లాన్ కంపెనీని కొనే ప్రయత్నంలో రిలయన్స్

మన్మథుడు సినిమాలో హీరో నాగార్జున ఓ లిప్ స్టిక్ కంపెనీ కోసం యాడ్ చేస్తాడు కదా గుర్తుందా. అదే రెవ్లాన్ కంపెనీ.

  • Written By:
  • Publish Date - June 19, 2022 / 10:00 AM IST

మన్మథుడు సినిమాలో హీరో నాగార్జున ఓ లిప్ స్టిక్ కంపెనీ కోసం యాడ్ చేస్తాడు కదా గుర్తుందా. అదే రెవ్లాన్ కంపెనీ. ఇప్పుడు అమెరికా కాస్మెటిక్స్ సంస్థల్లో దిగ్గజంగా పేరొందిన ఆ కంపెనీని సొంతం చేసుకోవడానికి రిలయన్ ఇండస్ట్రీస్ ప్రయత్నిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. రెవ్లాన్ కంపెనీ ఈమధ్య బాగా నష్టపోయింది. దీంతో దివాళా పిటిషన్ ను దాఖలు చేసింది. నిజానికి ఈ డీల్ గురించి ఇప్పటివరకు ఈ రెండు కంపెనీలు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

రెవ్లాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ చిన్నదేమీకాదు. ఛార్లెస్ అండ్ బ్రదర్స్ దీనిని 1932లో ఏర్పాటు చేశారు. ఈ కాస్మొటిక్స్ కంపెనీ.. నెయిల్ పాలిష్ లు, లిప్ స్టిక్ లను తయారుచేస్తుంది. 90 ఏళ్ల చరిత్ర కలిగిన రెవ్లాన్ కంపెనీ ప్రస్తుతం అమెరికాలో బిలియనీర్ అయిన రాన్ పెరెల్ మ్యాన్ సారథ్యంలో ఉంది. ఎలిజబెత్ అర్డెన్, ఎలిజబెత్ టేలర్ పేరుతో స్కిన్ కేర్, మేకప్, పెర్ ఫ్యూమ్స్ ని తయారుచేసి అమ్ముతుంది. మొత్తం 15 బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది.

రెవ్లాన్ కంపెనీని ఇప్పటికే అప్పుల భారం వెంటాడుతోంది. గతంతో పోలిస్తే.. కాస్మొటిక్స్ పరిశ్రమలో పోటీ బాగా పెరిగిపోయింది. ఇది కంపెనీని ఆర్థికంగా కుదుటపడనీయలేదు. పైగా ఈ ఏడాది మార్చి నెల నాటికి రెవ్లాన్ కంపెనీ అప్పులు 3.31 బిలియన్ డాలర్లు. కానీ ఇప్పుడు దీనిని కొనడానికి రిలయన్స్ ప్రయత్నిస్తోందన్న వార్తలు రావడంతో మార్కెట్ లో రెవ్లాన్ షేరు వేల్యూ పెరిగింది.

రిలయన్స్ సంస్థ విస్తరణ దిశగా ప్రణాళికలు తయారుచేసి అమలు చేస్తోంది. అందుకే దేశ, విదేశీ కంపెనీలను కొనడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోందని సమాచారం. బ్రిటన్ లో బాగా ఫేమస్ అయిన బూట్స్ ని సొంతం చేసుకోవడానికి అపోలోతో కలిసి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలోనే డున్జులో వాటాను కైవసం చేసుకుంది. ఇదే క్రమంలో రెవ్లాన్ పై దృష్టి సారించింది.