Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఓ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న టికెట్ ధరల పెంపుపై మెట్రో యాజమాన్యం పునర్విచారణ జరిపి, పెంచిన ఛార్జీలను కొంత మేర సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం ఛార్జీలను సగటున 10 శాతం వరకు తగ్గించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా ఛార్జీలు 2025 మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇటీవలే హైదరాబాద్ మెట్రో కనీస ఛార్జీని రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీని రూ.60 నుంచి రూ.75కి పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా రోజూ మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజానికం మీద భారం పడుతోందని, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను అందరికీ అందుబాటులో ఉంచాలని పలువురు డిమాండ్ చేశారు.
Read Also: KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
ప్రజా అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని, మెట్రో యాజమాన్యం చార్జీలపై మరోసారి సమీక్ష నిర్వహించింది. ప్రయాణికుల భాద్యతను పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లపై 10 శాతం వరకూ తగ్గింపు ప్రకటించింది. ఈ తగ్గింపు ప్రయాణించే దూరాన్ని బట్టి మారనుండగా, కొన్ని మార్గాల్లో ఇది గణనీయంగా ఉండనుంది. ఈ తాజా నిర్ణయం మెట్రోను ప్రతిరోజూ వినియోగించే ప్రయాణికులకు ఊరట కలిగించనుంది. ముఖ్యంగా షార్ట్ డిస్టెన్స్ ట్రిప్స్ తీసుకునే వారికి ప్రయోజనం కనిపించనుంది. ఉదాహరణకు, ఇప్పటి వరకు రూ.12గా ఉన్న కనీస ఛార్జీ మళ్లీ రూ.11కి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా, 75 రూపాయలుగా ఉన్న గరిష్ఠ ఛార్జీ తిరిగి రూ.67–70 మధ్య ఉండేలా సవరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒఫిషియల్‌గా తాజా ఛార్జీల వివరాలను మే 22న హైదరాబాద్ మెట్రో ప్రకటించే అవకాశం ఉంది. ప్రయాణికులు ఎటువంటి గందరగోళంలో పడకుండా సమగ్ర సమాచారం, మారిన ఛార్జీలు, టికెట్ ధరల పట్టిక తదితర వివరాలను మెట్రో వెబ్‌సైట్ ద్వారా అందించనున్నారు. ఆర్టీఎస్ స్మార్ట్ కార్డుల వినియోగదారులకు కూడా తగిన సమాచారం పంపించనున్నారు. చార్జీల సవరణతోపాటు మెట్రో యాజమాన్యం మరిన్ని మెరుగైన సేవలపై దృష్టి సారించనుంది. ట్రైన్ల ఫ్రీక్వెన్సీ, స్టేషన్‌ల పరిశుభ్రత, సెక్యూరిటీ వంటి అంశాల్లోనూ అభివృద్ధి జరగనుందని సమాచారం. ప్రయాణికులకు అందుబాటులో ఉండే మెట్రో యాప్‌లోనూ కొత్త ఫీచర్లను జోడించనున్నారు.
Read Also: JN.1 Variant: సింగపూర్, హాంగ్‌కాంగ్‌లో కోవిడ్ మళ్లీ విజృంభణ, భారత్‌లో అప్రమత్తత