GST : వేతన జీవులకు ఆదాయపన్ను రాయితీల రూపంలో కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో బంపర్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని తగ్గించేందుకు చర్యలు ప్రారంభించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సామాన్య ప్రజానికానికి రోజువారీ ఖర్చుల్లో కొంత తలనొప్పి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 12 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం, లేదా ఈ శ్లాబులో ఉన్న కొన్ని కీలక నిత్యావసర వస్తువులను 5 శాతం పన్ను శ్లాబులోకి తరలించడం వంటి ప్రతిపాదనలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ మార్పులు అమలయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇలాంటి చర్యల వల్ల కేంద్ర ఖజానాపై రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
Read Also: Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
దీని వల్ల తక్షణంగా ప్రభుత్వ ఆదాయానికి కొంత దెబ్బ తగిలినా, వినియోగదారులపై పన్ను భారం తగ్గడం వల్ల కొనుగోళ్లు పెరగవచ్చని, దీర్ఘకాలంలో వసూళ్ల పెరుగుదల దిశగా ఇది నడిపించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జీఎస్టీ రేట్లను సవ్యంగా హేతుబద్ధీకరించాలన్న సూచనలు చేశారు. ఇది కూడా ఈ నిర్ణయానికి పరోక్షంగా సంకేతమని భావిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు అమలయ్యే పక్షంలో టూత్‌పేస్ట్, కుక్కర్లు, గీజర్లు, సైకిళ్లు, రూ. 1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, రూ. 500 నుంచి రూ. 1000 మధ్య ధర కలిగిన షూస్ వంటి అనేక ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది నేరుగా సామాన్య ప్రజలకు ప్రయోజనకరం. దినసరి వినియోగ వస్తువుల ధరలు తగ్గడం ద్వారా కుటుంబ ఖర్చుల్లో కొంత ఉపశమనం కలుగుతుంది.
అయితే, జీఎస్టీ శ్లాబులపై మార్పులకు పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోందని సమాచారం. ఈ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్రాలు భావిస్తున్నాయి. జీఎస్టీకి సంబంధించిన ఏ మార్పైనా అమలులోకి రావాలంటే జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఈ నెలాఖరులో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, ఈ పన్ను తగ్గింపుతో కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కేంద్రం శుభవార్త అందించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ధరలు నియంత్రణలోకి రావడమే కాకుండా, వినియోగం పెరగడం ద్వారా దేశీయ ఉత్పత్తి రంగానికి కూడా ఊతమిచ్చే మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
కేంద్రం తెస్తున్న జీఎస్టీ పన్ను మార్పులతో తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..
.టూత్ పేస్ట్
.టూత్ పౌడర్
.గొడుగులు
.కుట్టు మిషన్లు
.ప్రెషర్ కుక్కర్లు
.వంట సామాగ్రి
.ఎలక్ట్రిక్ గీజర్లు
.ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు
.చిన్న వాషింగ్ మెషిన్లు
.సైకిళ్లు
.రెడీమేడ్ దుస్తులు
.ఫుట్ వేర్
.స్టేషనరీ వస్తువులు
.వ్యాక్సిన్స్
.సిరామిక్ టైల్స్
.వ్యవసాయ ఉపకరణాలు
Read Also: Separate Bill : మగవారికోసం పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు పెట్టాల్సిందే – శేఖర్ భాషా