Supreme Court : సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట లభించింది. శాసనసభలో ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు ఆపొద్దని స్పష్టం చేసింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తామని జస్టిస్ జెబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
Read Also: Nuclear Submarine Base: చైనాకు చెక్.. ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం
అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్‌ఎన్ రవి , తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత బిల్లులను తిరిగి సమర్పించినప్పుడు వాటిని క్లియర్ చేసి ఉండాల్సిందని బెంచ్ పేర్కొంది.
ఇక ఈ తీర్పు గవర్నర్ అధికారాలను ఏ విధంగానూ అణగదొక్కడం లేదు. గవర్నర్ అన్ని చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా ఉండాలి. అని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు గవర్నర్ తీరును తీవ్రంగా సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. గవర్నర్ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక, అసెంబ్లీలో ఆమోదించిన కీలక బిల్లులు ఆమోదం పొందక పోవడంతో స్టాలిన్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే స్టాలిన్ సర్కారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Read Also: Posani Krishna Murali: పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు