Site icon HashtagU Telugu

Supreme Court : భ‌ర్త బోర్డ‌ర్‌లో…భార్య హోట‌ల్‌లో…

భ‌ర్త మంచుకొండ‌ల్లో విధులు నిర్వ‌ర్తిస్తూ దేశ ర‌క్ష‌ణ కోసం పాటుప‌డుతుంటే భార్య బాధ్య‌త‌ లేకుండా తిరుగుతోందంటూ సుప్రీంకోర్టు (Supreme Court Of India) వ్యాఖ్యానించింది. పిల్ల‌ల‌ను విడిచి పెట్టి, వేరే వ్య‌క్తితో క‌లిసి ద‌గ్గ‌ర్లోని టౌన్‌లో హోట‌ల్ అద్దెకు తీసుకొని క‌ల‌సి గ‌డుపుతారా? అని ప్ర‌శ్నించింది. రాజ‌స్థాన్‌లోని ఓ గ్రామానికి చెందిన వ్య‌క్తి ఇండియ‌న్-టిబెట‌న్ బోర్డ‌ర్ ఫోర్స్‌లో చేరి జ‌మ్మూలో డ్యూటీ చేస్తున్నాడు. ఆయ‌న భార్య మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా తిర‌గ‌డం ప్రారంభించింది.

అయితే కొన్నాళ్ల‌కు వారి మధ్య తేడా వ‌చ్చింది. ఆ ప్రియుడు త‌నపై ప‌లుమార్లు అత్యాచారం చేశాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేసి, కోర్టులో ఛార్జిషీటు దాఖ‌లు చేశారు.ద‌ర్యాప్తు పూర్త‌వ‌డం, ఛార్జిషీటు కూడా దాఖ‌లు కావ‌డంతో రాజ‌స్థాన్ హైకోర్టు నిందితునికి బెయిల్ మంజూరు చేసింది. అత‌నికి బెయిల్ ఇవ్వ‌డం త‌గ‌దంటూ ఆమె సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.ఆ అప్పీలును ప‌రిశీలించిన ధ‌ర్మాసనం…ప్రాథ‌మికంగా ఆధారాల‌ను ప‌రిశీలించిన‌ప్ప‌డు ఇది అత్యాచారం కాకుండా, ప‌ర‌స్ప‌ర అంగీకారంతో జ‌రిగిన వ్య‌వ‌హారంగా అభిప్రాయ‌ప‌డింది. భ‌ర్త సంపాద‌న‌ను ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారా అని కూడా ప్ర‌శ్నించింది. హోట‌ల్‌లో ప్ర‌త్యేకంగా రూం తీసుకొని గ‌డుపుతున్నారు.. పాపం బోర్డ‌ర్‌లో ఉన్న ఆ వ్య‌క్తికి ఇవేమీ తెలియ‌డం లేదు అని వ్యాఖ్యానించింది. హైకోర్టు బెయిల్ ఇవ్వ‌డం స‌బ‌బేన‌ని, ఇందులో జోక్యం చేసుకోబోమ‌ని తెలిపింది. అయితే త‌న‌కు టీలో మ‌త్తు మందు క‌లిపి అత్యాచారం చేశాడ‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఫొటోల‌ను నెట్‌లో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసిన‌ట్టు తెలిపింది. కొంద‌రు కుటుంబ స‌భ్యులే ఆయ‌న‌కు స‌హ‌క‌రించార‌ని ఆరోపించింది.