రూ.2 వేల నోట్లకు సంబంధించి ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. ఆ నోట్లను త్వరలో ఉపసంహరించుకుంటున్నట్లు (Rs 2000 Notes To Be Withdrawn) ప్రకటించింది. రెండు వేల రూపాయల నోట్లు నిల్వ చేసుకున్న వారంతా .. సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రెండు వేల నోట్లను (Rs 2000 Notes To Be Withdrawn) వినియోగదారులకు ఇవ్వొద్దని బ్యాంకులకు సైతం మార్గదర్శకాలు ఇచ్చింది.
మే 23 నుంచి అన్ని బ్యాంకులతో పాటు 19 ఆర్బీఐ రీజనల్ బ్రాంచ్ లో ఈ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఈ రోజు నుంచి రూ.2 వేల నోట్ల జారీని నిలిపివేస్టున్నట్లు తెలిపింది. ఒక రోజులో ఒక వ్యక్తి రూ.20 వేలు మాత్రమే నోట్లను మార్చుకోవడానికి వీలుంటుందని తెలిపింది.
Also read : Swiggy: స్విగ్గీ పార్శిల్‌లో నకిలీ రూ.2,000 నోట్లు చూసి షాక్ అయిన కస్టమర్లు
మోడీ ప్రభుత్వం డిమానిటైజేషన్ చేసిన తర్వాత 2016 నుంచి మార్కెట్లో చెలామణిలో ఉంది. ఇటీవల ఈ నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ క్రమంలో 2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని తాజాగా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఏడాదిలో ఆర్బీఐ 2 వేల నోట్ల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్ లో ఏముంది అంటే ..
1. రూ.500, రూ.1000 నోట్లను 2016 నవంబరు నెలలో రద్దు చేశారు. దీంతో ప్రజల అవసరాలు తీర్చేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేసేందుకు రూ.2000 నోటును అప్పుడే ప్రవేశ పెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తర్వాత 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేశారు.
2. 89%కు పైగా రూ.2000 నోట్లను 2017 మార్చి నెలకు ముందే విడుదల చేశారు. అయితే.. ఆ నోట్లు 4-5 సంవత్సరాల్లోనే చెల్లుబాటు కాకపోవడం విశేషం. రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్ల చెలామణి 2018 మార్చి 31 నాటికి 37.8% తగ్గింది. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.62 లక్షల కోట్ల రూ.2000 నోట్లలో 10.8% మాత్రమే చెలామణిలో ఉన్నాయి. దీన్ని బట్టి రూ.2000 నోట్ల చెలామణి ఎక్కువగా జరగడం లేదని, కొందరి వద్దే పేరుకుపోయాయని ఆర్బీఐ గుర్తించింది.
3. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న ఆర్బీఐ ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించాలని నిర్ణయించింది.
4. రూ.2000 నోట్లు చట్టబద్ధమైన టెండర్ గా కొనసాగుతాయి.
5. 2013-2014లోనూ నోట్ల చెలామణిని ఆర్బీఐ ఇలాగే ఉపసంహరించుకుంది.
6. ప్రజలు రూ.2000 నోట్లను బ్యాంకుల్లోని తమ అకౌంట్లలో డిపాజిట్ చేసి ఇతర (రూ.500, రూ.200, రూ.100 తదితర) నోట్లను పొందొచ్చు. అయితే.. బ్యాంకులోని తమ అకౌంట్లలో డిపాజిట్ నిబంధనలు, పరిమితులు, ఇతర చట్టబద్ధమైన షరతులకు లోబడి చేయాల్సి ఉంటుంది.
7. మే 23 నుంచి అన్ని బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక పరిమితి ఉంది. రోజుకు రూ.20వేలకు మించి 2వేల రూపాయల నోట్లను మార్చుకునే వీలు ఉండదు. బ్యాంకుల ఇతర కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా ఉండేందుకుగానూ ఈ విధమైన ఎక్స్చేంజ్ పరిమితిని అమలు చేస్తారు.
8. నిర్దిష్ట సమయంలోగా రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేసేందుకుగానూ అన్ని బ్యాంకులు ఆ నోట్ల ఎక్స్చేంజ్, డిపాజిట్ ప్రక్రియలకు సెప్టెంబర్ 30 వరకు సహకరించాలి. దీనికి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను ఆయా బ్యాంకులకు పంపిస్తారు.
9. దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న 19 రీజియనల్ ఆఫీసులకు చెందిన ఇష్యూ డిపార్ట్మెంట్లలోనూ మే 23 నుంచి రూ.2000 నోట్ల ఎక్స్చేంజ్ వసతి అందుబాటులో ఉంటుంది.
10. మే 19 నుంచే రూ.2000 నోట్ల జారీని ఆపేయాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది.
11. ప్రజలు సెప్టెంబర్ 30లోగా రూ.2000 నోట్ల ఎక్స్చేంజ్, డిపాజిట్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలి. దీనికి సంబంధించి తలెత్తే సందేహాలను నివృతి చేసుకునేందుకు ఆర్బీఐ వెబ్ సైట్ లో ఉన్న “ఫ్రీక్వెట్లీ ఆస్క్డ్ క్వెశ్చన్స్” అనే డాక్యుమెంట్ ను చూడొచ్చు.