Site icon HashtagU Telugu

Ram Mohan Naidu : విమాన ప్రమాదం..సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Ram Mohan Naidu: Special committee formed for comprehensive investigation into plane crash

Ram Mohan Naidu: Special committee formed for comprehensive investigation into plane crash

Ram Mohan Naidu: అహ్మదాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం అత్యంత త్రీవంగా పరిగణిస్తోంది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పష్టంగా తెలిపారు. ఆయన శనివారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదానంతరం వెంటనే అత్యున్నతాధికారులతో భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించామని పేర్కొన్నారు. విమానం ప్రమాదానికి గురైన వెంటనే సహాయచర్యలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. గుజరాత్‌ ప్రభుత్వం మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ కలసి సమిష్టిగా స్పందించాయని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాం. మృతదేహాలను అక్కడి నుంచి తరలించాం. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించబడింది అని వివరించారు.

Read Also: Naked Flying: నేకెడ్ ఫ్లైయింగ్ గురించి మీరు విన్నారా? ఒంటిపై దుస్తులు కూడా ఉండ‌వా?

ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక కారణాలు ఏమిటి అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే కమిటీలో ఇంకా నిపుణులను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం బ్లాక్‌బాక్స్‌ను అధికారులు సేకరించినట్లు చెప్పారు. దీన్ని విశ్లేషించిన తర్వాత అసలు ఘటనపై పూర్తి స్పష్టత లభించనుంది. మేమూ దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని మంత్రి రామ్మోహన్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంలో తన వ్యక్తిగత అనుభవాన్ని మంత్రి వెల్లడించారు. నా తండ్రి కూడా ఒక విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మేమెన్ని కష్టాలు ఎదుర్కొన్నామో నాకు తెలుసు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చెప్పారు. దర్యాప్తు మరింత లోతుగా సాగించేందుకు హోంశాఖ సెక్రటరీ నేతృత్వంలో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. కమిటీ నివేదిక రెండు నెలల లోగా సమర్పించబడే అవకాశం ఉందని వివరించారు. అంతేకాకుండా బోయింగ్‌ 787 సిరీస్‌లో ఉన్న విమానాలన్నింటిపై విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు, పైలట్‌ అహ్మదాబాద్‌ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కేంద్రానికి “మేడే” సంకేతం పంపించినట్లు విమానయాన శాఖ కార్యదర్శి తెలిపారు. విమానం విమానాశ్రయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో, 650 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో కూలిపోయినట్లు చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఆ ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం 6 గంటల లోపే మంటలను అదుపు చేసిందని వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంపై ప్రభుత్వం అత్యంత బాధ్యతతో స్పందిస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్మోహన్‌ నాయుడు హామీ ఇచ్చారు.

Read Also: Free Aadhaar Update : మరోసారి ఆధార్‌ ఫ్రీ డాక్యుమెంట్ల అప్‌లోడ్‌ గడువు పొడిగింపు