Site icon HashtagU Telugu

Raksha Bandhan 2024 : నేడు ‘రక్షాబంధన్’ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Raksha Bandhan 2024

Raksha Bandhan 2024

నేడు రక్షాబంధన్ (Raksha Bandhan). తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే ‘రాఖీ పౌర్ణమిని’ దేశం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు ఉత్తరాదిలో మాత్రమే ఈ పండగను ఎక్కువగా జరుపుకుంటూనేవారు. కాలక్రమేణా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. సోదరుడు బాగుండాలని సోదరి ఆకాంక్షిస్తుంది. ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. ఇదే రక్షాబంధన్. తోబుట్టువులతో ప్రేమగా మెలగాలని, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండాలని ఈ పండగ సూచిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పాలి. రాఖీ పౌర్ణమి శ్రావణ సోమవారం నాడు రావడం ఒక విశేషం అయితే రాఖీ రోజు ఏడు విశేష శుభయోగాలు ఏర్పడుతున్నాయి. రక్షాబంధన్ నాడు రవి యోగం, శశ రాజయోగం, బుధాదిత్య యోగం, శోభనయోగం, సర్వార్ధ సిద్ధియోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నాయి. ఇక రాఖీ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీ కట్టే వేడుకను చాలా నియమనిష్ఠలతో చేయాలి. మనం వినాయక చవితి, దసరా పండుగలను ఏ విధంగా అయితే నియమాలతో జరుపుకుంటామో అంతే నిష్టగా రాఖీ పండుగ చేసుకోవాలి. రాఖీ కట్టే ఆడపిల్లలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి రాఖీ కట్టే ముందు అన్నదమ్ములకు పీట వేసి కూర్చోబెట్టి రాఖీ కడితే ఎంతో మంచిది.

తూర్పు కాని, ఉత్తరం వైపు కానీ సోదరుడు అభిముఖంగా ఉండేలా కూర్చోబెట్టి రాఖీ కట్టాలి. దక్షిణ దిశ వైపు పొరపాటున కూడా కూర్చోబెట్టకూడదు. అలాగే రాఖీ కడుతూ “యేన బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల” అనే మంత్రాన్ని చదువుకొని రాఖీ కడితే మంచి జరుగుతుంది. సోమవారం భద్రకాల సమయం సూర్యోదయాన 5.33గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.33 గంటల వరకు ఉంటుంది. భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ పండుగను జరుపుకోవచ్చు. మధ్యాహ్నం 1.34 గంటల నుంచి రాత్రి 9.08 గంటల వరకు శుభ సమయం ఉండనుంది కాబట్టి ఆ సమయంలో రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు.

Read Also : Hemant Soren : డబ్బు బలంతో కుటుంబాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది