కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. ఈ దాడిలో పర్యాటకుల పై ఉగ్రవాదులు జరిపిన దాడి(Pahalgam Terror Attack)పై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. దేశం మొత్తం దీనికి తగిన ప్రతీకారం తీసుకోవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) త్రివిధ దళాధిపతులతో అత్యవసర భేటీ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌లో తాజా పరిస్థితులు, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌పై వారు చర్చించారు.
ఈ భేటీలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్‌ఎస్ఏ) అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ దినేశ్ త్రిపాఠి పాల్గొన్నారు. భేటీ అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గామ్ దాడికి భారత్ అతి త్వరలోనే ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఎవ్వరూ భయపెట్టలేరని, దాడికి తగిన విధంగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజ్నాథ్ హెచ్చరించారు. ఎక్కడ దాగినా, ఎక్కడ ఉన్న, ఆ దోషులను పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడం భారత్ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.