Janwada Farmhouse Case : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి ఈరోజు మరోసారి మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదితో కలిసి వచ్చిన రాజ్ పాకాలను రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వద్ద కొనుగోలు చేశారనే అంశాలపై ప్రధానంగా విచారిస్తున్నట్టు సమాచారం. బుధవారం రాజ్ పాకాలను 7గంటలకు పైగా మోకిల పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకుని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం విడిచిపెట్టారు. బీఎన్ఎస్ఎస్ 35 (3) సెక్షన్ కింద మరోసారి పిలిస్తే విచారణకు రావాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో నేడు ఎక్సైజ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
మరోవైపు జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులతో ఈ మద్యం పార్టీ నిర్వహించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు.