Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హరియాణాలోని నర్వాల్ గ్రామానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి కారణమైంది. వినయ్ నర్వాల్ ఇటీవలే తన ప్రేయసి హిమాన్షిని వివాహమాడారు. వీరి పెళ్లి ఏప్రిల్ 16న హరియాణాలో జరిగింది. అనంతరం ఏప్రిల్ 19న ఆత్మీయులకు విందు ఏర్పాటు చేశారు. మొదట హనీమూన్ కోసం యూరప్ వెళ్లాలని వారు నిర్ణయించుకున్నా, వీసా తిరస్కరణతో జమ్మూ కశ్మీర్‌ను ఎంచుకున్నారు. కాని, వారి ప్రేమ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో వినయ్ మృతి చెందడంతో హిమాన్షి జీవితంలో తీరని విషాదం మిగిలింది.
Read Also: India Vs Pakistan: పాక్‌కు భారత్ భయం.. మాజీ దౌత్యవేత్త సంచలన ట్వీట్
పెళ్లైన వారం కూడా కాకముందే తన భర్తను కన్నీటి మధ్య వీడిన హిమాన్షి, అంత్యక్రియల సందర్భంగా భర్తకు సెల్యూట్ చేస్తూ విలపించిన దృశ్యం పలువురి హృదయాలను కదిలించింది. ఇక, ఈ దాడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని వర్గాలపై నిర్ధిష్ట వ్యాఖ్యలు రావడం పట్ల హిమాన్షి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదం మానవతా విరుద్ధమని, దాన్ని కుల, మత కోణాల్లో చూడకూడదని విజ్ఞప్తి చేశారు. కానీ, దీనికి విరుద్ధంగా కొందరు ఆమెను ట్రోల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళా కమిషన్ ఆమెపై వచ్చిన అప్రాసంగిక వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మహిళ గౌరవాన్ని కాపాడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇదే అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే స్పందిస్తూ, ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు.