Punganuru Girl Murder Case : వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా పుంగనూరులో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటనపై స్పందించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన హత్యేనని ఆరోపించారు. సెప్టెంబర్ 29 ఆదివారం రాత్రి నుంచి తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ.. పాప ఆచూకీని వెతకడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోజా ఫైరయ్యారు. బాలిక అదృశ్యమైన నాలుగురోజుల వరకూ పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం సొంతజిల్లాలోని నియోజకవర్గంలో ఏడేళ్ల బాలిక ఈ విధంగా హత్యకు గురవ్వడం.. ప్రభుత్వానికే సిగ్గుచేటని విమర్శించారు.
Read Also: Kishan Reddy : సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని రోజా దుయ్యబట్టారు. రెడ్ బుక్ లో తాము పేర్లు రాసిపెట్టుకున్నవారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంలో ఉన్న శ్రద్ధ.. ప్రజల భద్రతపై చూపించడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా ? మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైతే డీజీపీని హెలికాప్టర్లో పంపిన సీఎం.. ఆడపిల్ల హత్యకు గురైతే డీజీపీని ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై హోంమంత్రి అలసత్వం బట్టబయలైందన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి.. వాళ్లనే బెదిరించి, ఇళ్లకు పంపేసి కేసును క్లోజ్ చేయించారని రోజా ఆరోపించారు. ముచ్చుమర్రి మైనర్ హత్యోదంతంలో నేటికీ మృతదేహం జాడను కనుక్కోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హోంమంత్రి ఉన్న పక్క ఊరిలోనే ఒక కుటుంబం తమను కాపాడాలని కోరినా.. పట్టించుకోకపోవడంతో జైలు నుంచి వచ్చిన నిందితుడు మరో యువతిని పొట్టనపెట్టుకున్నాడని రోజా తెలిపారు.
Read Also: Asia Cup 2025 in India: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. పాక్‌తో 3 మ్యాచ్‌లు ఆడనున్న భారత్!
ఇలా రాష్ట్రంలో ఆడపిల్లలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఇప్పుడు పుంగనూరుకి జగన్ వస్తున్నారని తెలిసి.. పరువు పోతుందన్న భయంతో హోంమంత్రి అక్కడికి పరుగులు పెడుతున్నారన్నారు. గతంలో జరిగిన ఘటనలపై హోంమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా పుంగనూరు ఘటనలో నిందితులెవరైనా సరే కఠినంగా శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. అలాగే జగన్ పై కక్షతో దిశను నిర్వీర్యం చేయకుండా.. మహిళల భద్రతకోసం వాడాలని సూచించారు. మిమ్మల్ని కన్నతల్లి ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో ఆడపిల్లల భద్రత కూడా అంతే ముఖ్యంగా భావించి వారికి రక్షణ కల్పించాలన్నారు.