Site icon HashtagU Telugu

Congress : పోటీ కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం కొత్త కాదు: ప్రియాంకగాంధీ

priyanka gandhi heartfelt letter to the wayanad people

priyanka gandhi heartfelt letter to the wayanad people

Priyanka Gandhi : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇటీవలే ఈ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. రాహుల్ రాజీనామాతో జరుగుతోన్న వయనాడ్ ఉప ఎన్నికల ద్వారా ప్రత్యక్ష ఎన్నికలలో ప్రియాంకగాంధీ పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వయనాడ్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రియాంకా గాంధీ ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం తనకు కొత్తేమీ కాదని అన్నారు.

“కొన్ని నెలల క్రితం నేను, మా సోదరుడు రాహుల్‌తో కలిసి మండక్కై, చూరాల్‌మల వెళ్లాను. కొండచరియలు విరిగిపడటంతో ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా మీరు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన మీ ఆవేదనను కళ్లారా చూశా. పిల్లలను కోల్పోయిన తల్లులు, కుటుంబాన్ని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను చూశా. ఆ చీకటి రోజుల నుంచి బయటపడి నవశక్తితో మీరు ముందుకు కదిలిన తీరు స్ఫూర్తిదాయకం. నిస్సహాయ స్థితిలోనూ తోటి వారి కోసం మీరు పడిన ఆరాటం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆ విషాద సమయంలో మీరు చూపించిన అచంచలమైన ధైర్య సాహసాలే.. ఈరోజు నాలో స్ఫూర్తిని నింపాయి. మీ తరపున పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా”

”నా సోదరుడికి మీరు ఎంతో ప్రేమను, అభిమానాన్ని పంచారు. అదే ప్రేమను నాపైనా కురిపిస్తారని ఆశిస్తున్నా. చట్టసభలో మీ గళాన్ని వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. చిన్నారుల భావి భవిష్యత్తు, మహిళల శ్రేయస్సు కోసం నా శక్తికి మించి కృషి చేస్తానని మాటిస్తున్నా. ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ఈ ప్రయాణం నాకు కొత్త కావొచ్చు. కానీ, ప్రజల తరఫున గళం వినిపించేందుకు చేసే పోరాటం మాత్రం కొత్త కాదు. ఈ ప్రయాణంలో మీరంతా నాకు మార్గదర్శకంగా నిలుస్తారని ఆశిస్తున్నా” అని ప్రియాంకా గాంధీ రాసుకొచ్చారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌గాంధీ.. సీపీఐ నాయకురాలు అన్నీరాజాపై 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాహుల్‌ రాజీనామాతో జరుగుతోన్న ఉప ఎన్నికలో ప్రియాంకాగాంధీ కాంగ్రెస్‌ తరఫున పోటీకి దిగారు. కేరళలో పాలక్కాడ్‌, చెలక్కర అసెంబ్లీ స్థానాలతోపాటు వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నిక నవంబర్‌ 13న జరగనుంది. నవంబర్‌ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Read Also: YS Jagan : జగన్‌ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల