TDP Head Office Attack Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఇన్ని రోజులు వైఎస్‌ఆర్‌సీపీలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విచారిస్తూ వచ్చిన పోలీసులు ఇప్పుడు కీలక వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కీలక వ్యక్తిగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు(గురువారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, నాయకులు దేవినేని అవినాష్ లు విచారణకు హాజరయ్యారు. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు ఇవాళ నోటీసులు జారీ చేశారు. ముంబయిఎయిర్ పోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఎయిర్ పోర్ట్ అధికారులు అక్టోబర్ 15న నిలిపివేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై లుకౌట్ నోటీస్ జారీ చేసినందున అధికారులు ఆయనను నిలిపివేశారు. గుంటూరు పోలీసులతో ఎయిర్ పోర్ట్ అధికారులు సంప్రదింపులు జరిపిన తర్వాత అధికారులు ఆయనను వదిలివేశారు.
మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడు వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సన్నిహితుడు చైతన్య సోమవారం రోజున మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం విజయం సాధించిన నాటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అయితే తాజాగా అతను కోర్టులో లొంగిపోయారు. అలాగే సోమవారం నాడు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలసిల రఘురామ్‌ను మంగళగిరి పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ జరిపారు. దాడి సమయంలో తీసిన ఫొటోలను చూపించి పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కేసు విచారణ పూర్తిగా సీఐడీ చేతికి వెళ్లే వరకూ మంగిళగిరి పోలీసులు దర్యాప్తు చేస్తారు.