PM Modi : పారాలింపిక్స్‌ విజేతలతో ప్రధాని మోడీ సమావేశం

PM Modi meeting with Paralympic winners: ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. వారితో కాసేపు ముచ్చటించారు. 'అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయం.

Published By: HashtagU Telugu Desk
PM Modi meeting with Paralympic winners

PM Modi meeting with Paralympic winners

PM Modi meeting with Paralympic winners: స్వదేశానికి చేరుకున్న పారాలింపిక్స్‌ విజేతలతో ప్రధాని మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. వారితో కాసేపు ముచ్చటించారు. ‘అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయం. వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైంది. ఎంతోమందికి ఇది స్ఫూర్తిదాయకం” అని ఎక్స్‌లో ప్రధాని మోడీ ప్రశంసించారు. తాజాగా అథ్లెట్లతో మోడీ ముచ్చటిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భేటీలో కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, పారాలింపిక్స్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) హెడ్‌ దేవేంద్ర జజారియా కూడా పాల్గొన్నారు.

ప్రధాని ఎంతో ప్రోత్సహించారు..

పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో స్వర్ణం సాధించిన హర్విందర్‌ సింగ్‌.. ప్రధానితో జరిగిన సమావేశంలోని విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. ”ప్రధాని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మా బృందాన్ని ప్రశంసించారు. క్రీడా సిబ్బందితో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా నా బాణాన్ని ప్రధానికి బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది” అని పంచుకున్నాడు. కాగా.. ఇటీవల పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్లు అసాధారణ ప్రతిభ కనబరిచారు. ఏకంగా 29 పతకాలు సాధించి ఔరా అనిపించారు. పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌ భారత అథ్లెట్లు సత్తా చాటారు.

పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ అత్యధిక పతకాలు..

ఇందులో అత్యధిక మెడల్స్‌ అథ్లెటిక్స్‌లోనే రావడం విశేషం. ఈ విభాగంలో నాలుగు స్వర్ణాలు సహా 17 పతకాలు వచ్చాయి. ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 18వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ అత్యధిక పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2020లో నిర్వహించిన టోక్యో పారాలింపిక్స్‌లో 5 స్వర్ణాలు సహా 19 పతకాలను భారత్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సారి అంతకు మించి పతకాల పంట పండించింది.

Read Also: Peacock Feather: నెమలి ఈకతో ఏకంగా అన్ని దోషాలను తొలగించుకోవచ్చా?

  Last Updated: 12 Sep 2024, 06:42 PM IST