Sri Lanka : శ్రీలంకలో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో నిండిన ఓ ప్రభుత్వ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరో 35 మందికి పైగా గాయపడగా, వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే… శ్రీలంక దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ యాత్రా స్థలమైన కతర్‌గామ నుంచి వాయువ్య శ్రీలంకలోని కురునేగలకు 75 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. ఉదయం 11 గంటల సమయంలో, బస్సు కోట్‌మలె సమీపంలోని కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు మలుపు వద్ద అదుపుతప్పి ప్రక్కన ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం మేరకు, బస్సు సుమారు 100 మీటర్ల లోతైన లోయలోకి కూలిపోయినట్లు తెలుస్తోంది.
Read Also: NTR : చిరంజీవి గారు – బాలయ్య బాబాయ్ కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తే.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..
ప్రమాదం సంభవించిన వెంటనే స్థానిక ప్రజలు, పోలీస్, వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్న 15 మందిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ఈ దుర్ఘటనపై స్పందించిన రవాణా శాఖ ఉప మంత్రి ప్రసన్న గుణసేన, మృతుల సంఖ్యను అధికారికంగా ధ్రువీకరించారు. ప్రభుత్వం ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోందని, ప్రమాదానికి గల కారణాలు త్వరలో వెల్లడవుతాయని ఆయన తెలిపారు. డ్రైవర్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లేదా వాహనం సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిన అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రవాణా రంగంలో భద్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు హామీ ఇచ్చాయి.