నిత్యం సోషల్ మీడియాలో ఎన్నోరకాల వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోలు నమ్మశక్యంగా ఉన్నప్పటికీ మరి కొన్ని వీడియోలు మాత్రం అంత నమ్మశక్యంగా ఉండవు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ నిజమే అని భావిస్తూ ఉంటారు. అయితే చదువుకున్నవారు మాత్రం అందులో నిజమెంత ఆయన ఆరా తీసి తర్వాత ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఒక బావిలో నీరు తాగితే డయాబెటిస్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయి అని జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. దీనితో ఆ బావి వద్దకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
ఇకపోతే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలోని ప్రజలు ఇలాంటి విషయాలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇలాంటి విషయాలలో నిజానిజాలు తెలియకుండానే నమ్మేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం అనేక సంఘటనల్లో ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూశాం. వినాయకుడు పాలు తాగుతున్నాడని, చెట్టు నుంచి రక్తం వస్తుందని, ఇలా రకరకాల పుకార్లు, మూఢ నమ్మకాలు మన దేశంలో ఒకప్పుడు బాగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో ఇలాంటి పుకార్లు రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ జనాలు మాత్రం వీటిని నమ్మడం మానడం లేదు. ఇక అసలు విషయం లోకి వెళితే..హర్యానా రాష్ట్రంలోని రెవాడి జిల్లా గుజరీవాస్ గ్రామంలో నివాసం ఉండే మాండురామ్ తన పొలాన్ని స్థానికంగా ఉండే అలీ మహమ్మద్ అనే వ్యక్తికి కౌలుకిచ్చాడు. అయితే ఆ పొలంలో బోరు బావి ఉంది.
ఈ క్రమంలో అలీ భార్య కొన్ని రోజుల పాటు ఆ బోరుబావి నీటిని తాగిందట. దీంతో ఆమెకున్న డయాబెటిస్ తగ్గుముఖం పట్టిందట. ఈ క్రమంలో అదే విషయాన్ని ఆమె ఇరుగు పొరుగు వారికి చెప్పగా..అలా ఆ విషయం చుట్టు పక్కలంతా వ్యాపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ కావడంతే.. ఇక ఆ బోరుబావిలో ఉన్న నీటిని తాగేందుకు చాలా మంది ఇప్పుడు ఆ గ్రామానికి క్యూ కడుతున్నారు. ఆ బోరుబావిలో ఉన్న నీటిని తాగితే డయాబెటిస్ మాత్రమే కాదు, పలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయని జోరుగా ప్రచారం జరగడంతో ఆ బావి వద్దకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో సదరు బావిలోని నీటిని లీటర్‌కు 50 కు అమ్ముతున్నారట. అలాగే ఆ బావి ఉన్న పొలం దగ్గరకు వచ్చేవారికి చుట్టు పక్కల పొలాల వారు కొంత రుసుం వసూలు చేసి వాహనాల పార్కింగ్, ఇతర సదుపాయాలను కూడా అందిస్తున్నారట. అయితే ఈ విషయం సైంటిస్టులకు తెలియడంతో వారు ఆ బోరు బావి నీటిని పరీక్షించి చూశారు. కాగా అందులో ఔషధ గుణాలు మాత్రం లేవని, కానీ.. అందులో బాక్టీరియా పుష్కలంగా ఉందని, కనుక ఆ నీటిని తాగితే అనారోగ్య సమస్యలు మాయమవడం మాట దేవుడెరుగు, కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా వారు చెబుతున్నారు.
