Rs 20500 Crores Lose : పేటీఎం షేర్ల పతనం ఆగడం లేదు. ట్రేడింగ్‌లో సోమవారం వరుసగా మూడో రోజు కంపెనీ షేర్లు 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. గత మూడు ట్రేడింగ్ రోజుల్లో పేటీఎం షేర్లు 42 శాతం క్షీణించాయి. ఈ వ్యవధిలో ఇన్వెస్టర్లు రూ.20,500 కోట్లకుపైగా(Rs 20500 Crores Lose) నష్టపోయారు. పేటీఎం కంపెనీ వాల్యుయేషన్ శుక్రవారం రూ. 30,931.59 కోట్లుగా ఉంది. ఇది ఇవాళ రూ.27,838.75 కోట్లకు తగ్గింది. గురు, శుక్రవారాల్లో పేటీఎం వాల్యుయేషన్‌లో రూ.17378.41 కోట్ల నష్టం సంభవించగా, సోమవారం రోజు కంపెనీ వాల్యుయేషన్ రూ.3092.84 కోట్లు తగ్గిపోయింది. పేటీఎంను నిర్వహిస్తున్న One97 Communications Limited, Paytm Payments Services నోడల్ ఖాతాలను ఫిబ్రవరి 29లోపు వీలైనంత త్వరగా మూసేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ఉత్తర్వుల్లో పేర్కొంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో One97 కమ్యూనికేషన్స్ 49 శాతం వాటాను కలిగి ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ల సేవింగ్, కరెంట్ అకౌంట్లతో పాటు ప్రీ పెయిడ్ సాధనాలైన వాలెట్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు (ఎన్‌సీఎంసీ) ఫాస్టాగ్ అకౌంట్లలోకి డిపాజిట్లు లేదా టాప్ అప్‌లకు స్వీకరించొద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)ను ఆర్‌బీఐ గత బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join
మనీలాండరింగ్ ఆరోపణలతో ఎసరు
మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు కూడా పేటీఎంపై ఆరోపణలు వచ్చాయి. హవాలా లావాదేవీలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేయనుందన్న వార్తల నేపథ్యంలో పేటీఎం మరింత చిక్కుల్లో పడింది. దీనిపై ఈడీ విచారణ జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే మనీలాండరింగ్ ఆరోపణలను పేటీఎం పూర్తిగా ఖండించింది. తాజా వార్తల నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరని, ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని యాక్సిస్ సెక్యూరిటీస్ రాజేశ్ పాల్వియా చెప్పారు. 2021 నుంచి హవాలా లావాదేవీలు, ఇల్లీగల్ బెట్టింగ్ ఆరోపణలపై పేటీఎం.. ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నది.పేటీఎం నుంచి హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయని, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు ఉల్లంఘించినట్లు అనుమానాలు ఉన్నాయని కొన్ని నెలల క్రితమే మరోసారి ఈడీ అధికారులను ఆర్బీఐ అలర్ట్ చేసిందని సమాచారం.
Also Read : Gobi Manchurian : ఆ టౌన్‌లో గోబీ మంచూరియన్‌పై బ్యాన్.. ఎందుకు ?
వచ్చే నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు రద్దు ?
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్) లైసెన్సును వచ్చే నెలలో రద్దు చేసే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలుత డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించాక బ్యాంక్‌పై వేటు వేయవచ్చన్నారు. ఈ విషయంపై ఆర్‌బీఐ ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, పేటీఎం వివరణ కీలకం కానుందని వారన్నారు. పీపీబీఎల్‌లో మనీలాండరింగ్ జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తిస్తే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అన్నారు. అలాగే, ఈ సంక్షోభంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. ఫిన్‌టెక్ కంపెనీలు బ్యాంకింగ్ నియమావళికి అతీతం కాదని, పీపీబీఎల్‌పై చర్యలు చేపట్టేందుకు ఆర్‌బీఐకి అన్ని అధికారాలున్నాయన్నారు.