పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిన్నటి నుండి ఢిల్లీలో బిజీ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిన్నంతా కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సిన నిధులు , పలు అభివృద్ధికి సంబదించిన విషయాలను ప్రస్తావించగా..ఈరోజు ప్రధాని మోడీ (PM Modi) తో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) తో సమావేశమయ్యారు. అశ్విని వైష్ణవ్ తో భేటీ లో పిఠాపురం (Pithapuram) ప్రస్తావన తీసుకొచ్చారు. పిఠాపురం లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తో పాటు పలు రైళ్లను నిలుపుదల చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట, ఉప్పాడ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల పిఠాపురం పట్టణ పరిధిలో ట్రాఫిక్ రద్దీ చోటు చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన పలు రైల్వే ప్రాజెక్టుల పైన పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. పిఠాపురం పట్టణ పరిధిలో వివి సెక్షన్, సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో, రైల్వే కిలోమీటర్ 6.40, 30 – 32 వద్ద లెవెల్ క్రాసింగ్ నెంబర్ 431 కి బదులుగా ఆర్వోబి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, ఇక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఆర్వోబీ నిర్మాణం అవసరం అన్నారు. రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అలాగే పిఠాపురంలో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని వారి సౌకర్యార్థం రైళ్లకు పిఠాపురంలో హాల్టింగ్ కల్పించాలని కోరడం జరిగింది. పవన్ అభ్యర్ధనపై మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పిఠాపురం ప్రజలు గుడ్ న్యూస్ వినబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ అడగడం..కేంద్రం కాదనే పరిస్థితి ఉంటుందా..? అని జనసేన శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికి తనను ఎమ్మెల్యే గా గెలిపించిన పిఠాపురం ప్రజల నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ నిలుపుకుంటున్నాడు. నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చిన క్షణాల్లో ఆ సమస్య తెలుసుకోవడం..దానిని తీర్చడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సమస్యలు తీర్చడమే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
Read Also : BJP : రాష్ట్ర అధ్యక్ష పదవి పై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు