Site icon HashtagU Telugu

SpiceJet Accident Video: విమానంలో కుదుపులు, ప్రయాణికులకు గాయాలు!

Jet

Jet

ఇటీవల విడుదలైన ‘రన్ వే 34’ సినిమా స్టోరీని తలపించే ఒక ఘటన ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో చోటుచేసుకుంది. ముంబై నుంచి దుర్గాపూర్ కు సజావుగానే చేరుకున్న స్పైస్ జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి-737 విమానం.. ఇంకాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా గాల్లో భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్ధం కాక అయోమయానికి లోనయ్యారు. ‘కాల్ భైశాఖి’ అనే తుఫాను కారణంగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడంతో ఇలా జరిగింది. ఈవిషయంపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి పైలట్ కు సమాచారం అందకపోవడంతో.. తుఫాను కారణంగా గాలి ఒత్తిడి ఎక్కువగా ఉన్న గగన తలానికి చేరగానే విమానం కుదుపులకు గురైంది. పైకి, కిందికి ఊగిసలాడింది.

వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది .. వెంటనే సీటు బెల్టులు పెట్టుకోవాలంటూ ప్రయాణికులకు హెచ్చరించారు. కుదుపుల మరింత ఎక్కువయ్యాయి. ఎంతగా అంటే.. ప్రయాణికుల సీట్ల ఎగువ భాగంలో ఉండే లగేజీ భాగం నుంచి లగేజీ జారిపోయి ప్రయాణికుల తలలపై పడింది. విమానం ఎంత బలమైన కుదుపులకు గురైందంటే.. సీట్లు కూడా తెగిపోయి ప్రయాణికులు కిందపడ్డారు. ప్రయాణికుల వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. ఎట్టకేలకు పైలట్ విమానంపై పట్టు సాధించి.. సురక్షితంగా దుర్గాపూర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. కానీ ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. ఒక ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉంది. మిగితా వారికి స్వల్ప గాయాలే కావడంతో చికిత్స అందించి పంపించారు. ఈఘటనకు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, విమానం కుదుపులకు గురైన తర్వాత .. అందులోని ప్రయాణికులు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.