Parliament : పార్లమెంట్ బడ్జెట్ సమావేశలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 31నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు విడతల్లో జరగనున్నాయి. జనవరి 31వ తేదీన మొదలై ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. రెండవ విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. తొలి రోజు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి1న కేంద్రం ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా. అయితే మధ్య తరగతి ప్రజలు ఈసారి బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్నులో మినహాయింపులు కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఇన్‌కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచుతారని, పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు రానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా, నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డ్ సృష్టించనున్నారు. ఆమె కంటే ముందు అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ 10 సార్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. రెండు మధ్యంతర బడ్జెట్లు, 6 పూర్తి స్థాయి బడ్జెట్లను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినవారు అవుతారు.
Read Also: International Temple Conference : తిరుపతిలో తన రెండవ ఎడిషన్‌ను ప్రకటించిన ఎక్స్‌పో