Site icon HashtagU Telugu

Pan Card Compulsory : 2000 నోట్ల డిపాజిట్‌ 50వేలు మించితే పాన్‌ మస్ట్

New Pan Card

New Pan Card

Pan Card Compulsory : రూ.2,000 నోట్ల డిపాజిట్‌ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక  ప్రకటన చేశారు. రేపటి నుంచి బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన (Pan Card Compulsory) ఇప్పటికే ఉందని ఆయన గుర్తు చేశారు. ఆ నిబంధన రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని వెల్లడించారు. నగదు నిర్వహణలో భాగంగానే రూ.2,000 నోట్లను వెనక్కి  తీసుకుంటున్నామని  పేర్కొన్నారు. 2016లో నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడంలో భాగంగానే రూ.2,000 నోటును తీసుకొచ్చినట్లు శక్తికాంత దాస్‌ చెప్పారు. రూ.2,000 నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. సెప్టెంబరు 30లోగా చాలా వరకు రూ.2,000 నోట్లు ఆర్‌బీఐ ఖజానాకు చేరతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

also read : SBI: రూ.2000 నోటు మార్చుకోవడానికి పత్రాలు నింపాలా.. ఎస్‌బీఐ ఏం చెబుతోందంటే?

హడావుడి వద్దు.. నాలుగు నెలల టైం ఉంది 

రూ. 2000 నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు నెలల సమయం ఉందని గుర్తు చేశారు. రూ.2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదును అందుబాటులో ఉంచామన్నారు. 2000 నోట్ల  ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పెద్దగా ఉండదన్నారు .  చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా 10.18 శాతం మాత్రమేనని శక్తికాంత దాస్‌ వివరించారు. రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలు ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. పెద్ద మొత్తంలో అయ్యే రూ.2,000 నోట్ల డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందన్నారు. నోట్ల మార్పిడి కోసం వచ్చేవారికి నీడ, నీళ్ల వంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. కౌంటర్లన్నింటిలో నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది.