Pahalgam Terror Attack : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది తొలి ఫొటోను జాతీయ మీడియా బయటపెట్టింది. ఏకే 47 తుపాకీ చేత పట్టుకొని బూడిద రంగు కుర్తా ఫైజమా వేసుకున్న ఓ వ్యక్తి ఫొటోను విడుదల చేసింది. ఈ ఘటనలో కాల్పులకు తెగబడిన వారిలో తొలి ఫొటో ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు స్కెచ్ వేసిన.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్‌తోపాటు రావల్‌కోట్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Read Also: Virat Kohli: సీఎస్‌కే జెర్సీ చూసిన విరాట్ కోహ్లీ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్!
ఈ ఫొటోను నిన్న రాత్రి 1 నుంచి 2 గంటల ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసులు… సీఆర్‌పీఎఫ్, సైన్యంతో పంచుకున్నట్లు సమాచారం. ఇక, ఈ కాల్పులకు బాధ్యులై వారిని పట్టుకొనేందుకు సైన్యం, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు కాల్పుల ఘటనకు తామే బాధ్యులమంటూ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరీ తోయిబా ఇప్పటికే ప్రకటించుకొంది.
కాగా, జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో చెట్ల పొదల నుంచి సైనిక దుస్తులతో ఉగ్రవాదులు దూసుకు వచ్చి.. కాల్పులకు తెగ బడ్డారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదులు తరుముకొస్తున్న సమయంలో.. మైదాన ప్రాంతం కావడంతో.. పర్యాటకులు చెట్టుల చాటుకు వెళ్లి దాక్కునేందుకు వీలు లేక పోయిందని వారు వివరించారు. ఈ దాడిలో 8-10 మంది ఉగ్రమూకలు పాల్గొన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారిలో 5-7 మంది దాయాది పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పేర్కొంటున్నాయి. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
Read Also: Pakistan : కశ్మీర్ ఉగ్రదాడితో మాకు సంబంధం లేదు: పాకిస్తాన్