ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా8000 కప్ప ఎముకల అవశేషాలను బ్రిటన్ లో గుర్తించారు.మ్యూజియం ఆఫ్ లండన్ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతుండగా ఓ సాగునీటి కాల్వను తవ్వగా ఇవి బయటపడ్డాయి. ప్రస్తుత కేంబ్రిడ్జ్ నగరం సమీపంలోనే ఈ ప్రదేశం ఉంది. ఈ 8000 ఎముకల అవశేషాలు దాదాపు 350 కప్పలకు చెందినవి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. క్రీస్తు పూర్వం 400 ఏళ్ల క్రితం.. ఇనుప యుగ కాలం నాటి మనుషుల నివాసాలు కూడా ఇదే ప్రదేశంలో ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు.
“చలికాలం తీవ్రరూపు దాల్చడంతో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేక అప్పట్లో కప్పలు వలస వెళ్లి ఉండొచ్చు.ఈక్రమంలోనే అవి మార్గం మధ్యలోని కాల్వలో పడిపోయి బయటికి రాలేక చనిపోయి ఉండొచ్చని మేం అనుమానిస్తున్నాం ” అని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కప్పల ఎముకల పై కాలిన గాయాలు కానీ, తెగిన గాయాలు కానీ లేవు. దీంతో అవి ప్రమాదానికి గురై చనిపోయాయని భావించలేమని స్పష్టం చేశారు. 1980వ దశకంలోనే బ్రిటన్ లో కప్పల్లో “రానా వైరస్” ప్రబలి.. ఎన్నో కప్పలు చనిపోయాయి. బహుశా.. ఇనుప యుగంలోనూ అదే విధమైన వైరస్ ప్రబలి కప్పలు చనిపోయి ఉండొచ్చనే మరో విశ్లేషణ కూడా శాస్త్ర వర్గాల్లో వినిపిస్తోంది. ఆ సాగునీటి సరస్సు లో కప్పల ఎముకల అవశేషాలతో పాటు పలు మానవ అవశేషాలు, అస్థి పంజరాలు, ఇనుప రాతి యుగంలో వాడిన వస్తువులు కూడా బయటపడ్డాయి.
