Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ భూభాగంలో ఉగ్రవాదుల స్థావరాలపై తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత, భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాక్ మరియు పీఓకేలో ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర శిబిరాలు నేలమట్టం అయ్యాయి. ఈ మెరుపుదాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైపోయారని కేంద్రం ఇటీవల వెల్లడించింది. ఇందులో ఐదుగురు ప్రధాన ఉగ్ర నాయకులు ఉండటం గమనార్హం.
హతమైన ఉగ్రవాదుల వివరాలు:
1. ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుండాల్ – లష్కరే తయ్యిబా కీలక కమాండర్. ఇతని అంత్యక్రియలు పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించిందని సమాచారం. హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
2. హఫీజ్ మహమ్మద్ జమీల్ – జైషే మహమ్మద్ స్థాపకుడు మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. సంస్థలో కీలక పాత్రధారి.
3. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ – జైషే ముఠాకు చెందిన మరో కీలక నేత. మసూద్ అజార్‌కు మరొక బావమరిది అయిన ఇతడు, ఐసీ-814 విమాన హైజాక్‌లో ప్రధాన పాత్ర పోషించిన దొంగ.
4. ఖలీద్ అలియాస్ అబు అకాస – లష్కరే తయ్యిబాకు చెందిన టాప్ కమాండర్. జమ్మూకశ్మీర్‌లో అనేక దాడులకు నాయకత్వం వహించాడు. అఫ్గాన్ నుంచి ఆయుధాలు స్మగ్లింగ్ చేయడంలో నిపుణుడు.
5. మహమ్మద్ హసన్ ఖాన్ – జైషే మహమ్మద్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కుమారుడు. పీఓకే నుంచి ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌కు చొరబాటుకు నడిపిన కీలక వ్యక్తి.
లక్ష్యంగా ఎంపిక చేసిన స్థావరాలు:
భారత దళాలు మెరుపుదాడుల్లో, లాహోర్‌కు సమీపంలోని మురిద్కేలో ఉన్న లష్కరే తోయిబా శిబిరాన్ని లక్ష్యంగా తీసుకున్నాయి. ఇదే శిబిరంలో 26/11 ముంబయి దాడుల్లో పాలుపంచుకున్న అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ శిక్షణ పొందినట్టు సమాచారం. జైషే ప్రధాన స్థావరం అయిన బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్‌పైనా దాడి జరగ్గా, మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందినట్టు సమాచారం. భారత్ చేపట్టిన ఈ గట్టి చర్య, భవిష్యత్తులో ఏ ఉగ్ర చర్యకైనా గట్టిగా బదులు ఉంటుంది అనే సంకేతాన్ని స్పష్టంగా పంపింది.
Read Also: Border Tensions : హైదరాబాద్‌లో బాణసంచా కాల్చడంపై నిషేధం: సీవీ ఆనంద్
