Onion prices: గతంలో టమాట మాదిరిగా ఉల్లిపాయల ధరలు కూడా పైపైకి ఎగబాగుతున్నాయి. దీంతో ఉల్లి అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. హోటళ్లలో అయితే ఉల్లి నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అటు ఆహార పదార్థాల్లో ఉల్లి వినియోగాన్ని సైతం తగ్గించారు. పదిరోజుల క్రితం ఉల్లి రూ. 30 వరకు పలికేది. ఇప్పుడు మూడు రెట్లు పెరిగి.. రూ.100 వైపు పరుగులు తీస్తోంది. దాని ప్రభావం రుచి పై పడుతోంది.
సామాన్యులైతే ఇంటి అవసరాలకు తగ్గట్టు.. రెండు కిలోలు కొనుగోలు చేసిన వారు.. అరకిలో తో సరిపెడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి సాగు అధికం. ఆ రెండు రాష్ట్రాల నుంచే ఉల్లి సరఫరా జరుగుతోంది. మొన్నటి వరకు వర్షాలతో పంట నాశనమైంది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల తో సాగు తగ్గింది. మార్కెట్లో ఉన్న నిల్వలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఫలితంగా అది ధర పెరుగుదలకు కారణమవుతోంది.
ఎగుమతి ఆంక్షలు విధించిన తర్వాత ప్రాథమిక సరఫరా రాష్ట్రమైన మహారాష్ట్రలో టోకు ధరలు తగ్గడం ప్రారంభించినప్పటికీ ధరలు పెరిగాయి. దేశ రాజధానిలో ఉల్లి ధరలు అక్టోబరు 25న కిలోగ్రాము రూ. 40 వద్ద ఉండగా, అక్టోబర్ 29 నాటికి రెండు రెట్లు- పెరిగి ప్రస్తుతం 100 వరకు చేరుకున్నాయి. మరోవైపు కేంద్రం కూడా ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.