Onions: మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నిన్న, మెన్నటి దాకా రూ.70 ఉన్న కేజీ ధర శుక్రవారం కిలో రూ.100 పలికింది. కృష్ణగిరి జిల్లాతోపాటు పొరుగున సరిహద్దు ప్రాంతాల్లో ఉల్లి సాగు తగ్గడం కూడా కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. హోసూరు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా చిన్న ఉల్లిపాయ సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దిగుబడి తగ్గడంతో సరిహద్దుల్లో పండించిన చిన్న ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది. అదేవిధంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అత్తిబెలె, ఆనేకల్ ప్రాంతాల్లో కూడా సాగు చేస్తుంటారు. ఇక్కడి పంటలు స్థానికంతోపాటు విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
ఇప్పటికే కర్ణాటకలో కిలో రూ.100కు అమ్ముతున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ సరిహద్దు కర్ణాటక పరిధిలోనూ రూ. 100కు విక్రయిస్తున్నారు. దిగుబడి తగ్గడంతో అటు విదేశాలకు కూడా ఎగుమతి తగ్గించింది. ఈ ప్రభావంతో ఉల్లి ధరలు కొనకుండానే కళ్లు మండిపోతున్న పరిస్థితికి చేరుకుంటున్నాయి. దీంతో వినియోగదారులు లబో దిబో మంటున్నారు. ఉల్లి ధరలపై ప్రభుత్వాలు ముందుగానే దృష్టి పెట్టాలని అంటున్నారు. ఉల్లి కొరత కారణాలు తెలుసుకుని ప్రజలపై భారం పడకుండా చూడాలని కోరుతున్నారు.
కాగా, సాధారణంగా వంటల్లో చిన్నరకం ఉల్లినే ఉపయోగిస్తారు. అయితే ఈ రకం పంట దిగుబడి అమాంతం పడిపోయింది. దీంతో ఈ మధ్య కాలంలో ఉల్లి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మూడు నెలలకు ముందు రూ.20 ఉన్న ధర ఇప్పుడు పలుచోట్ల కిలో రూ.50 వరకూ అమ్ముతున్నారు. మున్ముందు ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.