Tomato Ketchup : కొన్నాళ్ల తరువాత టమాటా కెచప్ భూమిపై దొరకదా?

పఫ్ లైనా, ఫ్రైడ్ రైస్ తిన్నా, నూడిల్స్ లాగించాలన్నా పక్కన టమాటా కెచప్ లేకపోతే కష్టమబ్బా! ఆ కెచప్ ను కొంచెం కొంచెం వేసుకుంటూ తింటూ ఉంటే ఆ మజాయే వేరు.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 06:00 PM IST

పఫ్ లైనా, ఫ్రైడ్ రైస్ తిన్నా, నూడిల్స్ లాగించాలన్నా పక్కన టమాటా కెచప్ లేకపోతే కష్టమబ్బా! ఆ కెచప్ ను కొంచెం కొంచెం వేసుకుంటూ తింటూ ఉంటే ఆ మజాయే వేరు. పైగా హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినా సరే.. ఏదైనా హాట్ ఐటమ్ తింటే.. కచ్చితంగా పక్కన ఉండాల్సిన ఐటమ్.. టమాటా కెచప్. అది లేకపోతే ఎలా తినాలి అనేవారు కూడా లేకపోలేదు. కానీ కొన్నాళ్ల తరువాత భూమిపై టమాటా కెచప్ దొరకకపోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.

భూమిపై వాతావరణం చాలా వేగంగా మారిపోతోంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు కూడా ఏటికేడు పెరిగిపోతున్నాయి. ఈ కారణాల వల్ల టమాటా పంట కనుమరుగు అయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏటా వేసవిలో కూరగాయల దిగుబడి తగ్గి రేట్లు పెరుగుతాయి. టమాటా రేటూ కూడా అందుకే ఆమధ్య బాగా పెరిగింది. దీనికి కారణం.. వేసవి మహిమే. భవిష్యత్తులో కూడా ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటే టమాటా ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవచ్చంటున్నారు డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. దీనికి సంబంధించి స్టాటిస్టిక్స్ ప్రకారం ఓ నమూనాను కూడా తయారుచేశారు.

ప్రపంచంలో టమాటాలు ఎక్కువగా పండేది.. ఇటలీ, చైనా, కాలిఫోర్నియా. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ పంట ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. అందుకే గణిత నమూనా ప్రకారం చూస్తే.. 2050 నుంచి 2100 మధ్యకాలంలో టమాటా పంట సగానికి పైగా తగ్గిపోతుందని అంచనా వేసింది. ఇప్పటి నుంచి 2050 వరకు పరిస్థితి చూస్తే.. టమాటా ఉత్పత్తి ఆరు శాతం పడిపోతుంది.

ప్రపంచంలో ఎక్కువగా సాగయ్యే పంటలలో టమాటా ఒకటి. కానీ దీని దిగుబడి 14 మిలియన్ల టన్నుల నుంచి 7 మిలియన్ల టన్నులకు పడిపోవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. టమాటా పంట పడిపోతే.. టమాటా కెచప్, టమాటా పేస్ట్ కూడా కనుమరుగు అయిపోతాయి. ఇది టమాటా ప్రియులకు చేదువార్తే.