Odisha: ఒడిశాలో అరుదైన శస్త్రచికిత్స.. నాగుపాముకు ఆపరేషన్

నాగుపామును అంత దూరాన చూస్తేనే అందరూ పారిపోతారు. అలాంటిది దానిని పట్టుకుని.. ఆపరేషన్ చేయడమంటే మాటలా!

  • Written By:
  • Updated On - March 12, 2022 / 11:39 AM IST

నాగుపామును అంత దూరాన చూస్తేనే అందరూ పారిపోతారు. అలాంటిది దానిని పట్టుకుని.. ఆపరేషన్ చేయడమంటే మాటలా! అసలే బుసలు కొడుతుంది. దానికే చాలామందికి గుండాగిపోతుంది. కానీ ఒడిశాలో మాత్రం డాక్టర్లు.. ఆ పాముకు అరుదైన శస్త్రచికిత్సను చేశారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ పాముకు ఏమైంది.. ఏ ఆపరేషన్ చేశారు.. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి అని ఆరా తీస్తున్నారు.

ఒడిశాలోని భువనేశ్వర్ లో ఈ పాము కనిపించింది. ఆ ఊరిలోని వాసుదేవ్ నగర్ లో నిర్మాణమవుతున్న బిల్డింగ్ దగ్గర ఇది దర్శనమిచ్చింది. దాదాపు మూడున్నర అడుగులున్న ఈ నాగుపాము అక్కడున్న ఓ దుకాణంలో కనిపించడంతో.. దానిని చూసిన కూలీలు.. స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. స్నేక్ హెల్ప్ లైన్ వాళ్లు వచ్చి ఆ పామును పట్టుకున్న తరువాత అసలు విషయం వారికి అర్థమైంది. దాని పొట్టభాగంలో ఏదో ఇరుక్కుందని.. అందుకే అది ఇబ్బంది పడుతోందని గుర్తించారు. ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ లో ఉన్న జంతువిభాగానికి ఆ పామును తీసుకెళ్లారు.

అక్కడే ఆ పాముకు ఎక్స్ రే తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దాని పొట్ట భాగంలో సీసా మూత ఉందని వారికి అర్థమైంది. దీంతో వెంటనే దానికి ఆపరేషన్ చేశారు. దాని పొట్టలో ఉన్న ఆ సీసా మూతను బయటకు తీశారు. కానీ ఓ వారం రోజులపాటు దానిని పరిశీలనలో ఉంచుతామన్నారు. ఇప్పుడు ఆ పాము ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నాలుగు రోజుల పాటు కేవలం ద్రవపదార్థాలనే ఆహారంగా ఇస్తారు. తరువాత ఆరోగ్యాన్ని పరిశీలించి ఇతర ఆహార పదార్థాలను అందిస్తారు. నిజానికి నాగుపాము విషపూరితమే అయినా… అది ఉన్న పరిస్థితుల్లో సాయం చేసి మంచి మనసు చాటుకున్నవారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మూగజీవాలపై కరుణ మంచిదే అని అంటున్నారు.