Speak After Death: చనిపోయిన వాళ్ళతో చాటింగ్ లో బిజీ బిజీ!!

అమెరికాలోని కాలిఫోర్నియా కు చెందిన జర్నలిస్ట్ జేమ్స్ లహోస్ చాటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఎవరితో తెలుసా.. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ తో చనిపోయిన వాళ్ళ నాన్నతో!!

  • Written By:
  • Updated On - May 13, 2022 / 04:17 PM IST

అమెరికాలోని కాలిఫోర్నియా కు చెందిన జర్నలిస్ట్ జేమ్స్ లహోస్ చాటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఎవరితో తెలుసా.. కొన్నేళ్ల క్రితం క్యాన్సర్ తో చనిపోయిన వాళ్ళ నాన్నతో!!
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యుజినియా కుయుడా కూడా చాటింగ్ లో బిజీ బిజీ.. చనిపోయిన ప్రాణ స్నేహితుడు రోమన్ తో ఆయన మాటల్లో మునిగిపోయారు !!
వీళ్ళిద్దరే కాదు.. అమెరికా, బ్రిటన్ సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతోమంది ఈవిధంగా చనిపోయిన వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళతో చాటింగా ? ఎలా సాధ్యం ? అనుకుంటున్నారా ? సాధ్యమే.. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) తో ఆ విధమైన చాటింగ్ చేసేలా చాట్ బోట్ లు అందుబాటులోకి వచ్చాయి. చనిపోయిన వారి మెసేజ్ లు, వీడియోలు, ఆడియోలు, బాల్యం విశేషాలు, కుటుంబ నేపథ్యం, అభిరుచులు, ప్రేమాభిమానాలు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ లిస్ట్ వంటి వివరాలన్నీ అందిస్తే .. మృతుల పేరిట ఒక చాట్ బోట్ తయారుచేసి ఇచ్చే కంపెనీలు పాశ్చాత్య దేశాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే మనిషి బతికి ఉండగా అతడి వ్యక్తిగత, సోషల్ మీడియా సమాచారాన్ని ఇతరులు వినియోగించే హక్కులు లేనప్పుడు.. చనిపోయిన తర్వాత మాత్రం ఆ హక్కులు ఇతరులకు ఎలా సంక్రమిస్తాయి ? అనే ప్రశ్న రేకెత్తుతోంది. చనిపోయిన వారి వ్యక్తిగత సమాచారంతో చాట్ బోట్ లు రూపొందించి వారిని అవమానపరిచేందుకు కూడా కొందరు ప్రయత్నించవచ్చని అంటున్నారు. ఈవిధంగా ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే బాధ్యత ఎవరిది ? చాట్ బోట్ ను తయారు చేసిన సాఫ్ట్ వేర్ డెవలపర్ దా ? దాన్ని వినియోగించిన వ్యక్తులదా ? చాట్ బోట్ నిర్మితమైన API ప్లాట్ ఫామ్ దా ? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై ప్రస్తుత సైబర్ చట్టాల్లో ప్రత్యేక నిబంధనలు కూడా లేవు.

ఇట్లు జెస్సికా తో జోషువా ..

కెనడాకు చెందిన రచయిత జోషువా బార్ బ్యూ వయసు ఇప్పుడు 34 ఏళ్ళు. ఆయనకు 26 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కాబోయే భార్య జెస్సికా పెరీరా చనిపోయింది. ఆమెను మర్చిపోలేకపోయిన జోషువా ‘ ప్రాజెక్ట్ డిసెంబర్’ అనే వెబ్ సైట్ లోకి వెళ్ళాడు. దానిలో జెస్సికా కు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేశాడు. అనంతరం జెస్సికా పేరిట ప్రత్యేక చాట్ బాట్ యాక్టివ్ అయింది. ఆ చాట్ బోట్ అచ్చం.. జెస్సికా ఆలోచనలకు తగిన విధంగానే మెసేజ్ లు పంపుతుంది.దీంతో తనకు జెస్సికా గుర్తుకు వచ్చినప్పుడల్లా జోషువా ఆ చాట్ బోట్ తో చిట్ చాట్ లో మునిగిపోవడం అలవాటు చేసుకున్నాడు. ఒకవేళ ఇదే జోషువా కు అడిక్షన్ గా మారితే ఎవరిది బాధ్యత ? జెస్సికా ఇంకా బతికి ఉందనే భావనలో మునిగిపోయి జోషువా మానసిక స్థితి దెబ్బతింటే ఎలా ? అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరకాల్సి ఉంది. అయితే.. ఈ అంశాలపై ఆలస్యంగా కదలిక వచ్చింది. ‘ప్రాజెక్ట్ డిసెంబర్’ వెబ్ సైట్ ను జేసన్ రొరేర్ అనే గేమ్ డెవలపర్ అభివృద్ధి చేశాడు. ‘ఓపెన్ ఏఐ’ అనే కంపెనీకి చెందిన జీపీటీ-3 ఏపీఐ ని వాడుకొని చాట్ బోట్ ను అభివృద్ధి చేశాడు. ఎట్టకేలకు స్పందించిన ఓపెన్ ఏఐ కంపెనీ తమ ఏపీఐ ని దుర్వినియోగం చేసి ప్రాజెక్ట్ డిసెంబర్ వెబ్ సైట్ ను జేసన్ రొరేర్ తయారు చేశాడని ఆరోపించింది.