North Korea: ఉత్తర కొరియా శవాల దిబ్బగా మారుతుందా?

ఉత్తర కొరియా ఇకపై ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.

  • Written By:
  • Publish Date - May 18, 2022 / 09:57 AM IST

ఉత్తర కొరియా ఇకపై ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. వైద్య ఆరోగ్య వ్యవస్థ, టీకాలు, మందులు, ప్రపంచ దేశాల సాయం విరివిగా ఉన్న ఇండియానే సెకండ్ వేవ్‌లో లక్షల మందిని పోగొట్టుకుంది. అలాంటిది.. ఇలాంటి వ్యవస్థలేవీ సరిగా పనిచేయని ఉత్తర కొరియాలో కరోనా ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో ఊహించడానికి కూడా కష్టమే. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 15 లక్షల మంది కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. మరణాల సంఖ్య కూడా దారుణంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆరు నుంచి ఏడు లక్షల మంది క్వారంటైన్లో ఉన్నట్టు చెబుతున్నారు.
ఇన్ని లక్షల మందికి మందులు అందించలేక వైద్య వ్యవస్థ చేతులెత్తేసింది. క్వారంటైన్లో ఉన్న వారికి, ఆస్పత్రుల్లో చేరుతున్న వారికి, లక్షణాలు కనిపించిన వారికి మందులు సరఫరా చేయలేకపోతోంది.
దీంతో ఆర్మీని రంగంలోకి దించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. ఓవైపు ప్రజల ప్రాణాలు పోతున్నా.. కిమ్ మాత్రం కిమ్మనడం లేదు. తన పొగరు, పంతాన్ని వీడడం లేదు. పొరుగునే ఉన్న దక్షిణ కొరియా అవరమైన మందులు, కిట్లు, వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రెడీ అంటోంది.
కిమ్ ఊ అనడం ఆలస్యం ఉత్తర కొరియాలోకి పంపించేందుకు సై అంటోంది. యుద్ధం, ఆయుధ విన్యాసాలు ఏమైనా ఉంటే తరువాత చూసుకుందాం… ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం అనే సంకేతాలు పంపింది. అటు అమెరికా కూడా ఉత్తర కొరియాకు కరోనా మందులు, కిట్లు ఇవ్వడానికి సిద్ధమంటోంది. కాని, కిమ్ మాత్రం ఈ సాయం తీసుకోడానికి అంగీకరించట్లేదు. కరోనా దేశవ్యాప్తంగా ప్రబలడం ద్వారా హెర్డ్ ఇమ్యునిటీ పెంచుకోవాలనేది కిమ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇది జరగాలంటే కొన్ని వేల మంది ప్రాణాలు పోవాల్సి ఉంటుంది. కిమ్ దీనికి కూడా సిద్ధపడినట్టే తెలుస్తోంది. ఏదేమైనా.. జస్ట్ కొన్ని రోజుల్లోనే ఉత్తర కొరియా శవాల దిబ్బగా మారబోతోందంటూ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.