Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చైబాసా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఉన్న ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీని జూన్ 26న స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిని కూడా చైబాసా కోర్టు తిరస్కరించడంతో చివరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయాల్సి వచ్చింది.
Read Also:KTR : పార్టీ అధినేతకు లేఖ రాయడంలో తప్పేం లేదు..అంతర్గత విషయాలు..అంతర్గతంగానే చర్చించుకోవాలి: కేటీఆర్
ఈ పరువు నష్టం కేసు 2018లోని కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి సంబంధించినది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. “హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికీ బీజేపీలో అధ్యక్ష పదవులు దక్కుతాయా?” అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయంటూ, బీజేపీ నేత ప్రతాప్ కటియార్ జూలై 9, 2018న చైబాసా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పరిస్థితుల దృష్ట్యా 2020 ఫిబ్రవరిలో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసును రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. అయితే అనంతరం కేసును మళ్లీ చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు తిరిగి పంపించారు. అప్పటి నుంచీ కోర్టు పలు సార్లు సమన్లు జారీ చేసినా, రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు కఠినంగా స్పందించి తాజా నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.
రాహుల్ గాంధీపై జారీ అయిన ఈ వారెంట్ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. ఇప్పటికే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్, తాజాగా కోర్టు ఆదేశాలపై ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. జూన్ 26న ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా మరోసారి న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తారా? అన్నదానిపై దృష్టి నిలిచింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి సమయస్ఫూర్తిగా ఎదురవుతోంది. ఇప్పటికే విపక్ష నాయకుడిగా ప్రజలలో తిరుగుతున్న రాహుల్ గాంధీకి చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడటం పార్టీకి ఇబ్బందికరంగా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలివీ